ADR Report: లోక్‌సభలోనే వారసులెక్కువ!
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:37 AM
దేశవ్యాప్తంగా శాసనసభల్లోకన్నా లోక్‌సభలోనే వారసుల సంఖ్య అధికంగా ఉందని, దేశంలో వారసత్వ రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని..
543 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలవారే!
దేశంలోని అసెంబ్లీల్లో 20%, శాసన మండలిల్లో 22%
ఏపీలో 8, తెలంగాణలో 11 మంది ఎంపీలు వారసులే
పురుషుల కన్నా మహిళల్లోనే అధికం: ఏడీఆర్ నివేదిక
జాతీయ పార్టీల్లో కాంగ్రె్‌సలో వారసులెక్కువని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా శాసనసభల్లోకన్నా లోక్‌సభలోనే వారసుల సంఖ్య అధికంగా ఉందని, దేశంలో వారసత్వ రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. 543 మంది లోక్‌సభ ఎంపీల్లో 167 మందికి.. అంటే, 31 శాతం మందికి వారసత్వ నేపథ్యం ఉండగా, 224 మంది రాజ్యసభ ఎంపీల్లో 47 మందికి (21 శాతం) వారసత్వ నేపథ్యం ఉన్నదని వెల్లడించింది. ఈ మేరకు ఏడీఆర్ శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో 20ు మంది ఎమ్మెల్యేలకు, శాసనమండలిల్లో 22ు మంది ఎమ్మెల్సీలకు కుటుంబ వారసత్వం ఉంది. రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా వారసులు ఉన్నారు. ఆ రాష్ట్రానికి చెందిన 604 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 141 మంది వారసులే. యూపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (129 మంది), బిహార్ (96 మంది), కర్ణాటక (94 మంది) ఉన్నాయి. వారసుల విషయంలో తెలంగాణ 9వస్థానంలో ఉంది. తెలంగాణలో 176 మంది చట్టసభల సభ్యుల్లో 43 మంది (24ు) రాజకీయ కుటుంబాల నుంచి వచ్చారు. 11 మంది ఎంపీలు వారసత్వ నేపథ్యం నుంచే వచ్చారు. వారిలో గడ్డం వంశీకృష్ణ, సురేష్ షెట్కార్, జీ నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, ఆర్ రఘురాం రెడ్డి, మల్లు రవి, కె రఘువీర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, కడియం కావ్య ఉన్నారు. ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న ఏపీలో మొత్తం 255 మంది చట్టసభల సభ్యులు ఉండగా.. వారిలో 86 మంది (34ు) వారసులేనని ఏడీఆర్ తేల్చింది. ఏపీకి చెందిన లోక్‌సభ ఎంపీల్లో ఎనిమిది మందికి రాజకీయ వారసత్వం ఉంది. వారిలో జీఎం హరీశ్, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, పుట్టా మహేష్ కుమార్, కేశినేని శివనాథ్, బైరెడ్డి శబరి, దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. కాగా, దేశవ్యాప్తంగా చట్టసభల సభ్యుల్లో వారసత్వ నేపథ్యం నుంచి వచ్చిన వారిలో మహిళలే ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం 4,665 మంది పురుష ప్రజాప్రతినిధుల్లో 856 మందికి (18ు) వారసత్వ నేపథ్యం ఉంటే, 539 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో 251 మంది (47ు) రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన స్త్రీలు ఉన్నారని, వీరిలో అత్యధిక శాతం అంటే 69ు మంది మహిళలు మహారాష్ట్రలో ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రజాప్రతినిధుల్లో 69 శాతం మహిళలు వారసులు అయితే, పురుషుల్లో 29ు మంది మాత్రమే వారసత్వ నేపథ్యం ఉన్నవారు. తెలంగాణలో 64ు మంది మహిళలు, 21ు మంది పురుషులు వారసులేనని ఏడీఆర్ పేర్కొంది.
కాంగ్రె్‌సలో అత్యధికం
పార్టీల వారీగా చూస్తే.. కాంగ్రె్‌సలోనే అత్యధికంగా రాజకీయ వారసులు ఉన్నారు. జాతీయ పార్టీల్లోని మొత్తం 3,214 మంది ప్రజాప్రతినిధుల్లో కాంగ్రె్‌సలో 32ు, బీజేపీలో 18ు మంది వారసత్వ నేపథ్యం నుంచి వచ్చినవారని ఏడీఆర్ వెల్లడించింది. ప్రాంతీయ పార్టీల్లోని 1809 మంది సిట్టింగ్ ప్రజాప్రతినిధుల్లో 406 మందికి వారసత్వ నేపథ్యం ఉంది. వైఎస్సార్‌సీపీలో 38 శాతం మంది, తెలుగుదేశంలో 36 శాతం మంది వారసులే. బీఆర్‌ఎ్‌సలోని 52 మంది ప్రజాప్రతినిధుల్లో 10 మందికి వారసత్వ నేపథ్యం ఉన్నదని ఏడీఆర్ పేర్కొంది.