PM Modi Putin Selfie: అమెరికా రాజకీయాల్లో మోదీ-పుతిన్ సెల్ఫీ కలకలం
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:49 AM
ఇటీవల మనదేశంలో రెండ్రోజులు పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రధాని మోదీ..
భారత్ పట్ల ట్రంప్‌నకు ఘర్షణాత్మక వైఖరి ఎందుకు?
ఇలా అయితే మీకు నోబెల్ రాదు.. ఓ చట్టసభ్యురాలి వ్యాఖ్య
న్యూఢిల్లీ, డిసెంబరు 11: ఇటీవల మనదేశంలో రెండ్రోజులు పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రధాని మోదీ.. ఆయనతో కలిసి కారులో తన అధికార నివాసానికి వెళుతున్నప్పుడు తీసుకున్న సెల్ఫీ అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. భారీ సుంకాల విధింపు, ఘర్షణాత్మకమైన వైఖరిని అవలంబించడం ద్వారా అమెరికాకు ఎంతో విశ్వసనీయ దేశమైన భారత్‌ను అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు దగ్గర చేస్తున్నారని డెమోక్రాట్ సభ్యురాలు సిడ్నీ కమ్‌లాగర్ విమర్శించారు. చైనాపై విధిస్తున్న సుంకాల రేటుకన్నా భారత్‌పై విధిస్తున్న సుంకాల రేటే అధికంగా ఉందని పేర్కొన్నారు. ట్రంప్ తన తీరును మార్చుకోకపోతే అధ్యక్షుడిగా ఆయన హయాంలోనే భారత్‌తో స్నేహాన్ని అమెరికా కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలను శత్రుదేశాల చేతుల్లోకి నెట్టడం ద్వారా మీకు నోబెల్ బహుమతి రాదు’’ అని ట్రంప్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటని, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ పరిరక్షణకు భారత్ ఆవశ్యకతను మరో చట్టసభ్యుడు బిల్ హయిజింగా నొక్కి చెప్పారు. ట్రంప్ టారి్‌ఫల కారణంగా అమెరికా, భారత ప్రజలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.