PM Modi Visit: 13న మణిపుర్‌కు మోదీ
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:51 AM
ప్రధానమంత్రి మోదీ ఈనెల 13న మిజోరం, మణిపుర్ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ మేరకు తమకు సమాచారం అందిందని మిజోరంలోని పలువురు ప్రభుత్వ అధికారులు గురువారం వెల్లడించారు..
మిజోరంలోనూ పర్యటించనున్న ప్రధాని
ఐజ్వాల్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: ప్రధానమంత్రి మోదీ ఈనెల 13న మిజోరం, మణిపుర్ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ మేరకు తమకు సమాచారం అందిందని మిజోరంలోని పలువురు ప్రభుత్వ అధికారులు గురువారం వెల్లడించారు. అయితే, తుది ప్రయాణ ప్రణాళిక తమకు ఇంకా అందలేదని తెలిపారు. కాగా, మణిపుర్ అధికారులు మాత్రం ప్రధాని పర్యటనను నిర్ధారించలేదు. 2023 మే నెలలో మణిపూర్‌లో కుకీ, మైతీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ప్రధాని తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
శాంతి ఒప్పందంపై సంతకాలు..
మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు రెండు ప్రముఖ కుకీ-జో గ్రూపులతో ప్రభుత్వం గురువారం ఒప్పందం చేసుకుంది. మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కొనసాగించడం, దుర్బల ప్రాంతాల నుంచి శిబిరాలను తరలించడం, రాష్ట్రంలో శాంతి-స్థిరత్వం పునరుద్ధరణ కోసం కలిసి పనిచేయడానికి అంగీకరించిన నిబంధనలు, షరతులను ఒప్పందంలో పొందుపరిచారు. ఒప్పందంపై కేఎన్‌వో(కుకీ నేషనల్ ఆర్గనైజేషన్), యూపీఎ్‌ఫ(యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్) సంతకాలు చేశాయి. కేంద్ర హోంశాఖ, మణిపుర్ ప్రభుత్వం, కేఎన్‌వో, యూపీఎఫ్ ప్రతినిధులు గురువారం ఢిల్లీలో సమావేశమై ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.