Bilateral relations: మోదీ జోర్డాన్ పర్యటన ఫలప్రదం
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:04 AM
జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో తాను జరిపిన చర్చలు పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి సహా పలు కీలక రంగాల్లో.....
కీలకరంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం సుదృఢం: ప్రధాని
జోర్డాన్‌లో ముగిసిన పర్యటన.. ఇథియోపియాకు మోదీ
మోదీని వెంటబెట్టుకొని కారు నడిపిన దేశాధినేతలు
అమాన్, అడిస్ అబాబా, డిసెంబరు 16: జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో తాను జరిపిన చర్చలు పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి సహా పలు కీలక రంగాల్లో భారత్-జోర్డాన్ భాగస్వామ్యాన్ని సుదృఢం చేశాయని ప్రఽధాని మోదీ పేర్కొన్నారు. జోర్డాన్‌లో తన రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిందని మంగళవారం వెల్లడించారు. తన పర్యటన సందర్భంగా రాజు అబ్దుల్లా-2, జోర్డాన్ ప్రజలు కనబరిచిన అసాధారణ స్నేహశీలతను కొనియాడారు. అబ్దుల్లా-2తో తాను జరిపిన చర్చలు భారత్-జోర్డాన్ ప్రజల పురోగతి, శ్రేయస్సు దిశగా కొత్త బాటలు పరుస్తాయని ఉద్ఘాటించారు. జోర్డాన్ పర్యటన సందర్భంగా తొలిరోజు సోమవారం ఇరుదేశాల ప్రతినిధుల సమావేశానికి ముందు మోదీ, అమాన్‌లోని హుస్సేనియా ప్యాలె్‌సలో అబ్దుల్లా-2తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మంగళవారం మోదీ-అబ్దుల్లా-2 ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసంతో సుదీర్ఘకాలంగా సత్సబంధాలు కొనసాగుతున్నాయని ఇరుదేశాధినేతలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జోర్డాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాజు అబ్దుల్లా-2 ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటించారు. భారత ప్రధాని ఒకరు ఆ దేశంలో పర్యటించడం 37 ఏళ్ల అనంతరం ఇదే తొలిసారి. మూడు దేశాల పర్యటన కోసం సోమవారం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ, తన జోర్డాన్ పర్యటన ముగియడంతో మంగళవారం ఇథియోపియా వెళ్లారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని అబియ్ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చించారు. అంతకుముందు ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు చేరుకున్న మోదీకి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అబియ్ అహ్మద్ అలీ స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి మోదీకి స్వాగతం పలికారు. అనంతరం మోదీని కారులో ఎక్కించుకొని తాను స్వయంగా డ్రైవ్ చేస్తూ హోటల్‌కు తీసుకెళ్లారు. ఇథియోపియా అత్యున్నత పురస్కారమైన ‘గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ఆయన మోదీకి ప్రదానం చేశారు.