Prime Minister Narendra Modi: వందేమాతరం ఆత్మను తొలగించారు
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:06 AM
జాతీయ గేయం వందేమాతరం స్వాతంత్య్ర సంగ్రామానికి గొంతుకగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర్యానంతరం జాతి నిర్మాణానికి మహామంత్రమైందని చెప్పారు...
1937లో కీలక చరణాలు తీసేశారు.. దేశ విభజనకు అదే బీజం వేసింది: ప్రధాని
న్యూఢిల్లీ, నవంబరు 7: జాతీయ గేయం ‘వందేమాతరం’ స్వాతంత్య్ర సంగ్రామానికి గొంతుకగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర్యానంతరం జాతి నిర్మాణానికి మహామంత్రమైందని చెప్పారు. దురదృష్టవశాత్తూ అలాంటి పాట ఆత్మను తొలగించారని.. కీలక చరణాలను తీసివేసి రెండింటినే ఉంచారని కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శించారు. ఇదే దేశవిభజనకు బీజం వేసిందన్నారు. ఆ విభజన మనస్తత్వం నేటికీ సవాల్ విసురుతోందని తెలిపారు. అక్షయ నవమిని పురస్కరించుకుని 1875 నవంబరు 7న బంకించంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని రాశారు (ఆయన నవల ‘ఆనందమఠ్’లో ఉన్న ఈ పాట తొలుత ‘బంగదర్శన్’ పత్రికలో దర్శనమిచ్చింది). ఈ గేయం 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం శుక్రవారం నుంచి వచ్చే ఏడాది నవంబరు 7 వరకు ఏడాదిపాటు ఉత్సవాలు నిర్వహించనుంది. వాటిని ప్రధాని శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ మహామంత్రానికి ఎందుకు అన్యాయం చేశారో తెలుసుకోవలసిన అవసరం నేటి తరానికి ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘వందేమాతరం అన్ని కాలాలకూ ఉపయుక్తం. మన శత్రువులు ఉగ్రవాదం ద్వారా భారత భద్రతపై దాడికి సాహసించినప్పుడు.. నవభారతం పది ఆయుధాలు ధరించిన దుర్గగా రూపాంతరం చెందడాన్ని (ఆపరేషన్ సిందూర్) యావత్ ప్రపంచం చూసింది. వందేమాతరం మనకు సరికొత్త స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని ఇస్తుంది. ఇది పదమే కాదు.. మంత్రం.. శక్తి.. ఓ కల.. సంకల్పం’ అని తెలిపారు. బ్రిటి్‌షవారు భారత్‌ను వెనుకబాటుదేశంగా, తక్కువ స్థాయి కలిగిన దేశంగా చిత్రించాలని చూశారని.. కానీ వందేమాతరంలోని మొదటి పంక్తే.. ఈ తప్పుడు ప్రచారాన్ని బదాబదలు చేసిందని చెప్పారు. దేశాన్ని కేవలం భౌగోళిక రాజకీయ సంస్థగా చూసేవారికి.. దేశాన్ని తల్లిగా భావించడం విస్మయం కలిగించవచ్చు. కానీ భారత్ భిన్న దేశం. ఇక్కడ తల్లి బిడ్డకు జన్మనిస్తుంది.. పోషిస్తుంది.. తన పిల్లలు ప్రమాదంలో ఉంటే.. దుర్మార్గాన్ని సంహరిస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా భారత్ ఖ్యాతినార్జించినప్పుడు.. నవభారతం అంతరిక్షంలోని మారుమూలలకూ వెళ్లినప్పుడు.. ప్రతి భారతీయుడూ గర్వంతో వందేమాతరం అని నినదించాడు. మన ఆడపిల్లలు అంతరిక్షం నుంచి క్రీడల వరకు అన్ని రంగాల్లో అగ్రస్థానానికి చేరినప్పుడు.. వారు గగనతలంలో యుద్ధవిమానాలను నడుపుతున్నప్పుడు.. మనందరం వందేమాతరం అని సగర్వంగా అంటున్నాం’ అని చెప్పారు.
వందేమాతరాన్ని మోసింది కాంగ్రెస్సేఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ ఆ ఊసే ఎత్తలేదు: ఖర్గే
భారత జాతి ఆత్మను మేల్కొలిపిన వందేమాతరం గేయాన్ని సగర్వంగా భుజాన వేసుకుని మోసింది కాంగ్రెస్ పార్టీయేనని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ మాత్రం దానిని ఆలపించకుండా దూరంగా ఉన్నాయని ఆరోపించారు. జాతీయవాదానికి స్వయంప్రకటిత సంరక్షకులుగా ఇవి తమను తాము ప్రకటించుకుంటాయని... కానీ ఈ రెండూ ఎప్పుడూ ఆ గేయాన్ని ఆలపించలేదని శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. 1896లో కలకత్తాలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రహంతుల్లా సయానీ అధ్యక్షతన జరిగిన పార్టీ మహాసభల్లో.. ఠాగూర్ మొదటిసారి వందేమాతరం పాటను ఆలపించారని ఖర్గే తెలిపారు. 1937లో కాంగ్రెస్ పార్టీనే వందేమాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించిందన్నారు. ‘‘వందేమాతరాన్ని, ‘జనగణ మన’ను ఏనాడూ తమ శాఖల్లో గానీ, కార్యాలయాల్లో గానీ పాడని ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ.. జాతీయవాదానికి సంరక్షకులుగా చెప్పుకొంటున్నాయి’’ అని ఎద్దేవాచేశారు.