PM Narendra Modi: ఒకే ఒక్కడు.. మోదీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:57 AM
అల్లుడు సీజన్‌లాంటోడు.. వస్తాడు పోతాడు మనవడు.. చెట్టు.. వస్తే పాతుకుపోతాడు...
అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగా పదకొండేళ్లుగా టాప్‌లో మోదీ
సోషల్ మీడియాలో పోస్టు వైరల్
‘‘అల్లుడు సీజన్‌లాంటోడు.. వస్తాడు పోతాడు! మనవడు.. చెట్టు.. వస్తే పాతుకుపోతాడు’’ ...అని ఓ హిట్ సినిమాలో పాపులర్ డైలాగ్ ఉంది! 2014లో భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ కూడా అలాగే పాతుకుపోయారు! ఈ పదకొండేళ్ల కాలంలో పలు దేశాల్లో ప్రభుత్వాధినేతలెందరో మారారు. కానీ.. మోదీ ప్రజాదరణ, పాలన అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని.. నరేంద్రమోదీ! పదకొండేళ్లుగా ఆయన పీఎంగా ఉన్నారు. ఈ పదకొండేళ్లలో నేపాల్‌లో 9 మంది ప్రధానులు మారారు. పాకిస్థాన్‌లో ఐదుగురు.. యూకేలో ఆరుగురు.. జపాన్‌లో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు! అమెరికాలో నలుగురు అధ్యక్షులు, శ్రీలంక దేశాల్లో నలుగురు, ఫ్రాన్స్‌లో ఇద్దరు అధ్యక్షులు మారారు!! ఇన్నేళ్లయినా మోదీకి ప్రజాదరణ 70 శాతానికి పైగానే ఉంది’’ ...అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. లెక్కలు తీస్తే... ఆ పోస్టులో చెప్పిన ప్రభుత్వాల మార్పిడి లెక్కలు కరెక్టేగానీ మోదీలాగానే ఒకే వ్యక్తి ఒకసారికి మించి ప్రధాని/అధ్యక్షుడు అయిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు నేపాల్‌నే తీసుకుంటే.. 2014 నుంచి ఇప్పటిదాకా 9సార్లు ప్రభుత్వాలు మారాయి. కానీ.. ఈ సమయంలో ప్రధానులుగా ఉన్నది నలుగురే. సుశీల్ కోయిరాలా (ఒకసారి), ప్రచండ (మూడుసార్లు), షేర్ బహదూర్ దేవ్‌బా (మూడుసార్లు), కేపీ శర్మ ఓలి (రెండుసార్లు) ప్రధానులుగా వ్యవహరించారు. పాకిస్థాన్‌లో.. నవాజ్ షరీఫ్, షాహిద్ ఖాన్ అబ్బాసీ, నసీరుల్ ముల్క్ (ఆపద్ధర్మ ప్రధాని), ఇమ్రాన్ ఖాన్, షెహబాజ్ షరీఫ్ (రెండుసార్లు), అన్వరుల్ హక్ కాకర్ (ఆపద్ధర్మ ప్రధాని) ఈ పదకొండేళ్లలో ప్రధానులుగా ఉన్నారు. వీరిలో ఆపద్ధర్మ ప్రధానులను కూడా కలుపుకొంటే ఏడుగురు ప్రధానులు మారారు.
ఇక.. రవి అస్తమించని సామ్రాజ్యంగా ఒకప్పుడు వెలుగొందిన యూకేలో 2014 మే నుంచి ఆరుగురు ప్రధానులు మారారు. మోదీ ప్రధాని అయ్యేనాటికే బ్రిటన్ పీఎంగా ఉన్న డేవిడ్ కామెరాన్ 2015లో మరోసారి ఎన్నికయ్యారు. కానీ.. బ్రిటన్ ఈయూలో ఉండాలా వద్దా అనే అంశంపై నిర్వహించిన రిఫరెండంలో ప్రజాభిప్రాయం తన అభిప్రాయానికి వ్యతిరేకంగా రావడంతో 2016 జూలైలో రాజీనామా చేశారు. ఆ తర్వాత వరుసగా థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి శునాక్, కీర్ స్టార్మర్.. ఆ దేశ ప్రధానులయ్యారు. జపాన్‌లో షింజో అబే, యోషిహిడే సుగా, ఫ్యుమియో కిషిడా, షిగేరు ఇషిబా ప్రధాని పదవిని అధిష్ఠించారు. అమెరికాలో.. బరాక్ ఒబామా, ట్రంప్ (రెండుసార్లు), జో బైడెన్ అధ్యక్షులయ్యారు. లెక్కకు ముగ్గురేగానీ.. ప్రభుత్వాలు నాలుగు మారినట్టు. శ్రీలంకలోనూ మహింద రాజపక్స, మైత్రీపాల సిరిసేన, గొటబాయ రాజపక్స, రణిల్ విక్రమసింఘే, అనురకుమార దిసనాయకె.. ఇలా ఐదుగురు అధ్యక్షులు మారారు. ఇక.. సోషల్ మీడియా పోస్టులో వైరల్ అవుతున్నట్టు మోదీ ప్రజాదరణ ఇప్పటికీ 70ు ఉందా అంటే.. అమెరికాకు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ‘మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద వరల్డ్’ సర్వేలో 75ు అప్రూవల్ రేటింగ్‌తో మోదీ అగ్రస్థానంలో నిలిచారు.