Share News

NATO Chief Mark Rutte: ఉక్రెయిన్‌పై మాస్కోవ్యూహాన్ని మోదీ ఆరా తీశారు!

ABN , Publish Date - Sep 27 , 2025 | 02:53 AM

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. ఉత్తర అట్లాంటిక్‌ ఒప్పంద సంస్థ (నాటో) చీఫ్‌ మార్క్‌ రుట్టె కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాలతో భారత్‌ ...

NATO Chief Mark Rutte: ఉక్రెయిన్‌పై మాస్కోవ్యూహాన్ని మోదీ ఆరా తీశారు!

  • నాటో చీఫ్‌ మార్క్‌ రుట్టె కీలక వ్యాఖ్యలు

  • నిరాధారం.. అవాస్తవం: విదేశాంగ శాఖ

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. ఉత్తర అట్లాంటిక్‌ ఒప్పంద సంస్థ (నాటో) చీఫ్‌ మార్క్‌ రుట్టె కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాలతో భారత్‌ తీవ్ర ప్రభావానికి గురవుతోందని, ఆ ప్రభావం రష్యాపైనా పరోక్షంగా పడుతోందని తెలిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా అనుసరిస్తున్న వ్యూహం ఏంటనే విషయాన్ని భారత ప్రధాని పదే పదే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆరా తీస్తున్నారని వ్యాఖ్యానించారు. అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 80వ సర్వప్రతినిధుల సభకు హాజరైన రుట్టె సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ప్రభుత్వం.. రష్యా సర్కారుతో టచ్‌లో ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా అనుసరిస్తున్న వ్యూహాన్ని.. ప్రధాని మోదీ పదేపదే కోరినట్టు తెలిసింది.’’ అని అన్నారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధిస్తున్న సుంకాలు.. రష్యాపైనా పెద్ద ప్రభావమే చూపిస్తున్నాయని తెలిపారు. ‘‘పుతిన్‌కు ఫోన్‌ చేసిన మోదీ.. ఉక్రెయిన్‌పై వ్యూహాన్ని వివరించాలని కోరారు. దీనికి కారణం.. భారత్‌పై సుంకాల ప్రభావం తీవ్రంగా ఉండడమే.’’ అని రుట్టె వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌ చేసి.. ఉక్రెయిన్‌పై అనుసరిస్తున్న వ్యూహాన్ని అడిగారంటూ నాటో చీఫ్‌ మార్క్‌ రుట్టె చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నట్టు భార త విదేశాంగ శాఖ తెలిపింది. రుట్టె చేసిన వ్యాఖ్యలు అవాస్తవం, నిరాధారమని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని నాటో చీఫ్‌ను కోరింది. ఎప్పుడూ జరగని సంభాషణ గురించి ఊహాజనిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంది.

Updated Date - Sep 27 , 2025 | 02:53 AM