Share News

PM Narendra Modi: ప్రభుత్వాధినేతగా పాతికేళ్లు!

ABN , Publish Date - Oct 08 , 2025 | 03:39 AM

ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. ప్రభుత్వాధినేతగా పాతికేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్నారు...

PM Narendra Modi: ప్రభుత్వాధినేతగా పాతికేళ్లు!

  • మోదీ అరుదైన ఘనత

న్యూఢిల్లీ, అక్టోబరు 7: ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. ప్రభుత్వాధినేతగా పాతికేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్నారు. 2001 అక్టోబరు 7న గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2014 మే 22 వరకు ఆ పదవిలో ఉన్నారు. అదే నెల 26న ప్రధానమంత్రిగా ప్రమా ణం చేసిన మోదీ 11 ఏళ్లకుపైబడి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంపై మంగళవారం ఆయన స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు.. ఇంత గొప్పదేశం పురోగతిలో పాలుపంచుకోవడానికి నిరంతరాయంగా తాను కృషి చేస్తున్నానని ‘ఎక్స్‌’లో వరుస ట్వీట్లు చేశారు. 2001లో ఇదే రోజు తొలిసారి గుజరాత్‌ సీఎంగా ప్రమాణం చేశాను. మొదట స్వరాష్ట్రంలో.. ఇప్పుడు దేశంలో మార్పులకు శ్రమిస్తున్నాను. సహచర భారతీయులు నిరాటంకంగా ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రభుత్వాధినేతగా 25వ ఏట అడుగుపెడుతున్నాను. భారత ప్రజలకు కృతజ్ఞుడిని’ అని పేర్కొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు 2013లో బీజేపీ తనను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసేనాటికి దేశం పాలన, విశ్వాస సంక్షోభంలో పడి ఉందని చెప్పారు. యూపీఏ హయాంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, విధాన పక్షవాతంతో విలవిలలాడిన భారత్‌.. ఇప్పు డు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ, సామాజిక భద్రత పథకాలకు నెలవుగా మారిందన్నారు. ‘దేశం స్వావలంబన సాధించేందుకు మన రైతులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. భారత్‌ అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధించేందుకు (ఆత్మనిర్భర భారత్‌) ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపడుతోంది. ‘ఇది స్వదేశీ వస్తువని గర్వంగా చెప్పండి’ అన్న నినాదంలో అవి ప్రతిబింబిస్తున్నాయి. 11 ఏళ్లుగా భారత ప్రజలందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఎన్నో పరివర్తనలు తీసుకొచ్చాం. విప్లవాత్మక చర్యలతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాలను.. ముఖ్యంగా నారీశక్తి, యువ శక్తి, అన్నదాతలను సాధికారత దిశగా నడిపిస్తున్నాం. 25 కోట్ల మందికిపైగా ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేశాం. ప్రధాన ప్రపంచ ఆర్థిక శక్తుల నడుమ చోటు సంపాదించాం’ అని మోదీ వివరించారు.

పుతిన్‌కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పుతిన్‌ 73వ జన్మదినం కావడంతో ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

Updated Date - Oct 08 , 2025 | 03:39 AM