Prime Minister Narendra Modi visited Udupi Math: ఇది నవ భారతం
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:21 AM
ఉగ్రదాడులు జరిగినప్పుడు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. అయితే ప్రస్తుత నవ భారతం తన ప్రజలను రక్షించుకోవడంలో వెనకడుగు వేయదని..
ఎవరికీ తల వంచదు
రామజన్మభూమి పోరాటంలో ఉడుపి మఠం కీలకపాత్ర : మోదీ
బెంగళూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఉగ్రదాడులు జరిగినప్పుడు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. అయితే ప్రస్తుత నవ భారతం తన ప్రజలను రక్షించుకోవడంలో వెనకడుగు వేయదని, ఎవరికీ తల వంచదని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఒకరోజు పర్యటనలో భాగంగా ఆయన ఉడుపికి వచ్చారు. పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్రతీర్థ స్వామీజీ మోదీకి ఘన స్వాగతం పలికారు. కనకన కిండి(కనకదాసు కిటికీ) ద్వారా శ్రీకృష్ణుడి మూలవిరాట్‌ను ప్రధాని దర్శించుకున్నారు. కనకదాసుకు పుష్పార్చన చేసి, కనకనకిండికి ఏర్పాటు చేసిన బంగారు కవచాన్ని, సువర్ణ తీర్థ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీకృష్ణమఠం నిర్వహించిన లక్ష కంఠ భగవద్గీతా పఠనంలో పాల్గొని గీతా పారాయణం చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అయోధ్య రామజన్మభూమి పోరాటంలో ఉడుపి మఠం కీలక పాత్ర పోషించిందని, ఈ విషయం దేశానికి తెలుసన్నారు.
ఇక్కడే కొత్త పాలనకు పునాది
పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ మార్గదర్శకంలోనే అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ జరిగిందని మోదీ గుర్తుచేశారు. రామమందిరంలో ఉడుపి మధ్వాచార్యులకు కేటాయించిన ప్రత్యేక ద్వారం ఉందని తెలిపారు. శాంతి, సత్యాన్ని పునఃస్థాపించడంతో పాటు దౌర్జన్యాన్ని అంతం చేయాలని భగవద్గీత మనకు నేర్పుతుందని, ఇదే మన జాతీయ భద్రతా విధానం సారాంశమని అన్నారు. ఎర్రకోట నుంచి శ్రీకృష్ణుడి కరుణ సందేశాన్ని వినిపించామని, ఆయన స్ఫూర్తితో ‘మిషన్ సుదర్శన చక్ర’ను ప్రకటించామని తెలిపారు. దేశంలోని ప్రముఖ స్థలాలు, పారిశ్రామిక ప్రాంతాలు, జనం చేరే ప్రదేశాల చుట్టూ రక్షణ కవచాన్ని రూపొందించామని చెప్పారు. దీన్ని శత్రువులు ఛేదించలేరన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా నీటి సంరక్షణ, మొక్కలు నాటడం, పరిశుభ్రత, స్వదేశీ, దేశ్ దర్శన్, ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా మరియు క్రీడలు, పేదలకు సహాయం చేయడం అనే తొమ్మిది సంకల్పాలు చేయాలని ప్రజలను మోదీ కోరారు.
‘భారత భాగ్య విధాత’ మోదీ
లక్ష కంఠ గీతా పారాయణలో భాగంగా భగవద్గీత 15వ అధ్యాయంలోని పలు శ్లోకాలను ప్రధాని పఠించారు. ఇదే వేదికపై శ్రీకృష్ణ మఠం మోదీని ‘భారత భాగ్య విధాత’ బిరుదుతో సత్కరించింది. మజ్జిగ చిలికే వెండి కవ్వాన్ని మఠాధిపతి ప్రధానికి బహూకరించారు. 2008లో గుజరాత్ సీఎం హోదాలో తొలిసారి ఉడుపికి వచ్చిన మోదీ, ప్రస్తుతం ప్రధాని హోదాలో వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు.
గోవాలో 77 అడుగుల శ్రీరాముడి విగ్రహావిష్కరణ
శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం గోవాలో 77అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని పర్తగలి మఠంలో ఉన్న ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. ప్రజల్లో ఐక్యత ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమని అన్నారు. నేడు భారత్ సాంస్కృతిక పునరుజ్జీవన దశలో ఉందన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం, కాశీ విశ్వనాథ్ థామ్ పునరుద్ధరణ, ఉజ్జయినిలో మహాకాళ్ మహాలోక్ విస్తరణ వంటివన్నీ అందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. కాగా, ఇది ప్రపంచంలోనే ఎత్తయిన రాముడి విగ్రహమని గోవా మంత్రి దిగంబర్ కామత్ తెలిపారు.