Share News

Prime Minister Modi: గుజరాత్‌ మాదిరిగానే ఇథియోపియా సింహాల భూమి!

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:31 AM

ఇథియోపియా ఆఫ్రికాకు కూడలి అయితే భారత్‌ హిందూ మహాసముద్రానికి హృదయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు...

Prime Minister Modi: గుజరాత్‌ మాదిరిగానే ఇథియోపియా సింహాల భూమి!

  • నాకు ఇక్కడ స్వస్థలంలో ఉన్నట్టే అనిపిస్తోంది: మోదీ

  • ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

అడిస్‌ అబాబా, ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి, డిసెంబరు 17: ఇథియోపియా ఆఫ్రికాకు కూడలి అయితే భారత్‌ హిందూ మహాసముద్రానికి హృదయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రాదేశిక శాంతి, భద్రత, అనుసంధానంలో భారత్‌-ఇథియోపియా ‘సహజ భాగస్వాములు’ అని అన్నారు. బుధవారం మోదీ, ఇథియోపియన్‌ పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మరింత సమానత్వం, మరింత శాంతిసామరస్యాలతో కూడిన ప్రపంచం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని ఉద్ఘాటించారు. ఇథియోపియాకు రావడం తనకు అద్భుతమైన అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఇథియోపియా సింహాల భూమి అని, ఇక్కడ తనకు స్వదేశంలో ఉన్నట్టే అనిపిస్తోందని చెప్పారు. ఎందుకంటే.. తన స్వరాష్ట్రమైన గుజరాత్‌ కూడా సింహాల భూమేనని మోదీ పేర్కొన్నారు. భారత్‌లోని 140 కోట్ల మంది జనం తరఫున స్నేహ, సోదర, సద్భావనలతో కూడిన సందేశాన్ని తాను తీసుకొచ్చానని చట్టసభ్యుల కరతాళ ధ్వనుల మధ్య మోదీ పేర్కొన్నారు. మోదీ ప్రసంగం పూర్తయ్యాక అక్కడి చట్టసభ్యులంతా గౌరవసూచకంగా లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు. మోదీ ప్రసంగిస్తుండగా చట్టసభ్యులు దాదాపు 50సార్లు చప్పట్లు కొట్టడం విశేషం. ప్రధాని హోదాలో మోదీ, ఇథియోపియాకు వెళ్లడం ఇదే తొలిసారి అయితే ఒక దేశ పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం ఇది 18వసారి. అంతకుముందు మంగళవారం రాత్రి మోదీ గౌరవార్థం ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్‌ అలీ విందు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో ఇథియోపియాకు చెందిన ముగ్గురు గాయకులు, భారత జాతీయ గేయమైన వందేమాతరాన్ని ఆలపించారు. వారు ఆ గేయాన్ని పాడుతుండగా మోదీ రెండు చేతులు పైకెత్తి అభినందన పూర్వకంగా చాలాసేపు చప్పట్లు కొట్టారు. అనంతరం.. దీనికి సంబంధించిన ఓ వీడియోను మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. వందేమాతర గేయం 150 ఏళ్ల వేడుకులను భారత్‌ జరుపుకొంటున్న సందర్భంగా ఇథియోపియా గడ్డమీద ఆ గేయాన్ని ఆలపించడం తననెంతో కదిలించిందని ఆ పోస్టులో ప్రధాని రాశారు.


ఒమన్‌ ఉప ప్రధాని స్వాగతం

బుధవారం సాయంత్రంతో ఇథియోపియాలో మోదీ రెండురోజుల పర్యటన ముగిసింది. తర్వాత ఆయన అక్కడి నుంచి రెండు రోజుల పర్యటన కోసం ఒమన్‌ రాజధాని మస్కట్‌కు మోదీ చేరుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత్‌, ఒమన్‌ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) జరగనుంది. మోదీకి మస్కట్‌ విమానాశ్రయంలో ఆ దేశ ఉప ప్రధాని, రక్షణమంత్రి సయ్యద్‌ షీహాబ్‌ అల్‌ సయీద్‌ స్వాగతం పలికారు. ఒమన్‌ రాజు హైతం బిన్‌ తారిఖ్‌తో మోదీ గురువారం సమావేశం కానున్నారు. కస్టమ్స్‌, ఇతర సుంకాలను తొలగించడం ద్వారా ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా రెండేళ్లుగా భారత్‌ కృషిచేస్తోంది. ఒమన్‌తో వాణిజ్య ఒప్పందం దిశగా తాము ఆశావహంతో ఉన్నట్లు భారత రాయబారి జీవీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోని బలుచిస్థాన్‌తో సరిహద్దు కలిగిన ఒమన్‌కు భారత్‌తో నౌకాదళ విన్యాసాలకు సంబంధించిన ఒప్పందం కూడా ఉంది. ఇరుదేశాల మధ్య ఎగుమతి, దిగుమతి సగానికిపైగా అంతరం ఉంది. ఆరోగ్యసేవలు, ఖనిజ, సహజ వాయువు అంశాలకు సంబంధించి భారతీయ వాణిజ్యవర్గాల డిమాండ్‌ ఒమన్‌ వద్ద పెండింగ్‌లో ఉండగా గురువారం జరగనున్న ఒప్పందంలో దీనిపై ఓ స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. ఇక ఒమన్‌కు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో వైద్యచికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి వస్తున్న నేపథ్యంలో ఒమన్‌లో సొంతంగా అడుగుపెట్టాలని అపోలో చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అపోలో ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతా రెడ్డి కూడా భారతీయ వాణిజ్య బృందంలో సభ్యురాలిగా ప్రస్తుతం మస్కట్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో బహిరంగసభ ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని తెలుస్తోంది. కాగా జోర్డాన్‌, ఇథియోపియా, ఒమన్‌ దేశాల్లో నాలుగురోజుల పర్యటన నిమిత్తం మోదీ ఈనెల 15న ఢిల్లీ నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే. గురువారంతో మోదీ విదేశీ పర్యటన ముగియనుంది.

Updated Date - Dec 18 , 2025 | 06:42 AM