PM Modi: చొరబాటుదారులకు దేశద్రోహుల అండ
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:33 AM
చొరబాటుదారులకు దేశద్రోహులు అండగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి మోదీ ఇండి కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు.
ఓటరు జాబితా సవరణను అందుకే వ్యతిరేకిస్తున్నారు
ఇండి కూటమిపై మోదీ ఆరోపణలు
గౌహతి/ కోల్‌కతా, డిసెంబరు 20: చొరబాటుదారులకు దేశద్రోహులు అండగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి మోదీ ఇండి కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకే ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన టీఎంసీ నేతలు గో బ్యాక్ మోదీ అంటున్నారని చెప్పారు. అస్సాం గౌహతిలో రూ.4 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన లోక్‌ప్రియ గోపీనాథ్ బర్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాం తొలి సీఎం గోపీనాథ్ బర్దోలోయ్ 80 అడుగుల విగ్రహాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం మోదీ గౌహతిలో మెగా రోడ్‌షో నిర్వహించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు ఆయన వెంట రోడ్‌షోలో పాల్గొన్నారు.
బిహార్‌లో జరిగిందే బెంగాల్‌లోనూ..
పశ్చిమబెంగాల్ నుంచి కూడా జంగిల్‌రాజ్‌ను వదిలించుకోవాలని ప్రధాని మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్ రానాఘాట్‌లోని తాహెర్‌పూర్ నేతాజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బిహార్ ప్రజలు జంగిల్‌రాజ్‌ను వదిలించుకున్నారని, అదే ఇప్పుడు బెంగాల్‌లోనూ జరగబోతుందన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటోందని, అందుకే ప్రజలు బిహార్‌లో 20 ఏళ్ల తర్వాత కూడా ఎన్డీయే ప్రభుత్వానికి మరోమారు పట్టం కట్టారని చెప్పారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, పశ్చిమబెంగాల్ కోల్పోయిన ఘనతను, కీర్తిని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో తిరిగి తీసుకువస్తామన్నారు. మోదీని, బీజేపీని వ్యతిరేకించే పేరుతో మమత సర్కారు బెంగాల్ ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తోందని మోదీ ఆరోపించారు. ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు కారణంగా మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్‌పూర్ హెలిపాడ్ వద్ద ల్యాండ్ కాలేక కోల్‌కతాకు వెనక్కి మళ్లాల్సి వచ్చింది. దీంతో ఆయన బహిరంగసభకు హాజరైనవారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. మరోవైపు మోదీ సభకు హాజరయ్యేందుకు వస్తూ రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు కారణంగా రైలు కనపడకపోవడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. బీజేపీ కార్యకర్తల మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.