PM Modi accused Nehru: వందేమాతరానికి నెహ్రూ ద్రోహం
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:16 AM
ముస్లింలీగ్ నేత మహ్మదాలీ జిన్నాకు తలొగ్గి.. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గేయానికి ద్రోహం చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. దానిని ఛిన్నాభిన్నం చేసి.. భారత్‌ను బుజ్జగింపు రాజకీయాల వైపు తీసుకెళ్లారని .....
జిన్నాకు తలొగ్గి గేయాన్ని ఛిన్నాభిన్నం చేశారు: మోదీ
సామాజిక సామరస్యం ముసుగులో రెండు చరణాలకు కుదించారు
ఇప్పటికీ అదే బుజ్జగింపు రాజకీయం.. కాంగ్రె్‌సపై ప్రధాని ధ్వజం
న్యూఢిల్లీ, డిసెంబరు 8: ముస్లింలీగ్ నేత మహ్మదాలీ జిన్నాకు తలొగ్గి.. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గేయానికి ద్రోహం చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. దానిని ఛిన్నాభిన్నం చేసి.. భారత్‌ను బుజ్జగింపు రాజకీయాల వైపు తీసుకెళ్లారని ఆక్షేపించారు. బంకించంద్ర ఛటర్జీ 1875లో ‘వందేమాతరం’ గేయాన్ని రాశారు. ఇది జరిగి 150 ఏళ్లయిన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రధాని ప్రత్యేక చర్చను ప్రారంభించారు. అర్ధరాత్రి 11.42 గంటల వరకు సుదీర్ఘంగా ఇది జరిగింది. పాలక, ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంతో బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడిందని.. ఆ తర్వాత వందేమాతర గేయం దానిని సవాల్ చేసిందని.. స్వాతంత్య్ర పోరాటాన్ని ఉర్రూతలూగించి.. స్వాతంత్య్ర సాధన దిశగా జాతీయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని.. దీనివల్లే దీనిని భారత జాతీయ గీతంగా చేయాలని మహాత్మాగాంధీ అభిలషించారని ఆయన చెప్పారు. గాంధీజీ మనోభావాలను తోసిరాజని.. ఈ గేయాన్ని వివాదంలోకి నెట్టి ఎందుకు ద్రోహం చేశారో తనకు అర్థం కాలేదన్నారు. ‘ముస్లింలీగ్ నాయకుడు మహ్మదాలీ జిన్నా లఖ్‌నవూలో 1937 అక్టోబరు 15న వందేమాతరంపై తన వ్యతిరేకత వ్యక్తంచేశారు. ఆ తర్వాత ఐదు రోజులకే నెహ్రూ నేతాజీకి లేఖ రాశారు. బంకించంద్ర ఛటర్జీ ‘ఆనందమఠ్’ నవల కోసం ఈ గేయాన్ని రాశారని.. ఈ నేపథ్యం ముస్లింలను ఇబ్బందిపెట్టే అవకాశముందని అందులో పేర్కొన్నారు. బంకించంద్ర స్వరాష్ట్రమైన బెంగాల్లోనే.. కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వందేమాతరంపై సమీక్ష జరిపింది. అక్టోబరు 26న సామాజిక సామరస్యం ముసుగులో.. గేయాన్ని రెండు చరణాలకు కుదించాలని నిర్ణయించింది. దీంతో యావద్దేశం దిగ్ర్భాంతికి గురైంది. కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశభక్తులు నిరసనలు చేపట్టారు. ముస్లింలీగ్‌కు కాంగ్రెస్ మోకరిల్లి బుజ్జగింపు రాజకీయాలకు దిగిందనడానికి చరిత్ర తార్కాణంగా నిలిచింది. సదరు రాజకీయాల ఒత్తిడితోనే వందేమాతరంతోపాటు దేశవిభజనకూ తలొగ్గింది’ అని మండిపడ్డారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వైఖరి ఇప్పటికీ మారలేదని.. బుజ్జగింపు రాజకీయాలు కొనసాగిస్తూ.. వందేమాతరంపై వివాదాలు సృష్టించే యత్నాలు చేస్తూనే ఉన్నాయన్నారు.
పూర్వవైభవం తేవాలి: రాజ్‌నాథ్
వందేమాతరం పూర్తి గేయం గానీ, ఆనందమఠ్ నవల ఇస్లాంకు వ్యతిరేకం కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నొక్కి చెప్పారు. నాటి బెంగాల్ నవాబుకు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను అవి ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వందేమాతరాన్ని నిర్లక్ష్యం చేశామని, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పారు. దానికి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపిచ్చారు. కాగా, గాంధీ కుటుంబాన్ని, కాంగ్రె్‌సను మోదీ ఎండగడుతున్నందున.. అపరాధ భావనతోనే రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ సభలో వందేమాతరంపై మోదీ ప్రసంగించే సమయంలో గైర్హాజరయ్యారని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ఆరోపించారు. వందేమాతరం విషయంలో కాంగ్రె్‌సలో పశ్చాత్తాపమే లేదని మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. ఇంకా తేజస్వి సూర్య (బీజేపీ), బైరెడ్డి శబరి, జి.లక్ష్మీనారాయణ (టీడీపీ), సునీల్ తత్కరే (ఎన్‌సీపీ), రాజ్‌కుమార్ సాంఘ్వాన్ (ఆర్‌ఎల్‌డీ), దీపేందర్ హూడా, పరిణితి షిండే, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్), మహువా మొయిత్రా, కాకోలీ ఘోష్ దస్తీదార్ (టీఎంసీ), అవధేశ్ ప్రసాద్, ఇఖ్రా చౌధరి, ప్రియా సరోజ్ (సమాజ్‌వాదీ), రాజారాంసింగ్ (సీపీఐఎంఎల్ లిబరేషన్), అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), హనుమాన్ బెనీవాల్ (ఆర్‌ఎల్‌పీ), తదితరులు చర్చలో పాలుపంచుకున్నారు.
మహా అసెంబ్లీలో పూర్తిగా ఆలాపన
మహారాష్ట్ర అసెంబ్లీలో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించారు. సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయం ప్రకారం ఉభయ సభల్లోనూ వందేమాతరం తొలి రెండు చరణాలను ఆలపించిన తర్వాత రాష్ట్ర గీతం ‘జై జై మహారాష్ట్ర’ గేయాన్ని ఆలపించారు. అయితే, వందేమాతరం 150 సంవత్సరాల సందర్భంగా ఈ ఏడాది వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించాలని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, శాసనమండలి చైర్మన్ రామ్ షిండే సూచించారు. దీంతో ఉభయసభల్లోనూ వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించారు.
బంకిన్ దా కాదు.. బంకిన్ బాబు!
బంకించంద్ర ఛటర్జీని మోదీ తన ప్రసంగంలో ‘బంకిన్ దా’ అని పిలవడంపై టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ అభ్యంతరం తెలిపారు. దీంతో ప్రధాని వెంటనే ‘బంకిన్ బాబు’ అని సరిదిద్దుకున్నారు. సౌగతారాయ్‌ను దాదా అనే అంటానని.. దీనిపైనా అభ్యంతరం చెబుతారా అని చురకంటించారు. కాగా, వందేమాతరంపై చర్చ కోసం ప్రధాని సోమవారం సభలో అడుగుపెట్టగానే..బీజేపీ ఎంపీలు ‘బిహార్ కీ జీత్ హమారీ హై...అబ్ బెంగాల్ కీ బారీ హై(తర్వాతి వంతు బెంగాల్‌దే)’ అని స్వాగతం పలికారు.