Minister Warns of Strict Action: ఇండిగో వ్యవహారాన్ని తేలికగా తీసుకోలేదు
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:08 AM
ఇండిగో సంక్షోభంపై పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు స్పందించారు....
కఠిన చర్యలు తప్పవు: మంత్రి రామ్మోహన్
న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇండిగో సంక్షోభంపై పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు స్పందించారు. ‘‘ఇండిగో సిబ్బంది రోస్టరింగ్ సహా అంతర్గత ప్రణాళిక వైఫల్యం కారణంగానే ఈ సంక్షోభం తలెత్తింది. పౌర విమానయాన రంగంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాం. ఈ నెల 3వ తేదీ వరకు అన్నీ సజావుగానే సాగాయి. తర్వాత ఇబ్బంది తలెత్తింది. విమానాల రద్దుకు దారితీసిన సాఫ్ట్‌వేర్ విషయంపై విచారణకు ఆదేశించాం. అన్ని విమాన సంస్థలతోనూ చర్చించాం. విమానాశ్రయాల్లో పరిస్థితులను నియంత్రించాం. దీంతో గత రెండు రోజుల్లో పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. పౌర విమానయాన రంగంలో భవిష్యత్తులో ఉల్లంఘనలకు పాల్పడే వారికి గుణపాఠం చెప్పేలా తమ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, ఇండిగో అంశంలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నారని రామ్మోహన్‌కు ప్రధాని మోదీ కితాబు ఇచ్చారు. ఇండిగో సంక్షోభంపై సోమవారం రాజ్యసభలో రామ్మోహన్ ఇచ్చిన సమాధానంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.