Asaduddin Owaisi: ఎంఐఎం సత్తా!
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:28 AM
బిహార్‌లో ఎంఐఎం మరోసారి తన ఉనికిని చాటుకుంది. ఐదు స్థానాల్లో విజయం సాధించింది. 25 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ.. ముస్లింలు అధికంగా ఉండే సీమాంచల్ ....
25 స్థానాల్లో పోటీ.. ఐదింట విజయం
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్కోరు
నాడు గెలిచిన నాలుగు మళ్లీ కైవసం
బిహార్‌లో ఎంఐఎం మరోసారి తన ఉనికిని చాటుకుంది. ఐదు స్థానాల్లో విజయం సాధించింది. 25 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ.. ముస్లింలు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఉన్న మొత్తం 24 నియోజకవర్గాల్లో బరిలో దిగి ఐదు స్థానాలు గెలుచుకుంది. అన్నింటా 20 వేలకుపైగా మెజారిటీ సాధించింది. ఆమోర్ స్థానంలోనైతే ఏకంగా 38,928 ఓట్ల మెజారిటీ దక్కటం గమనార్హం. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఐదు స్థానాల్లో విజయం సాధించటం గమనార్హం.
పదేళ్ల కిందట తొలిసారి
బిహార్ రాజకీయాల్లోకి ఎంఐఎం పదేళ్ల కిందట ప్రవేశించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు పోటీ చేసి ఓడిపోయింది. 2019లో కిషన్‌గంజ్‌లో జరిగిన ఉప ఎన్నిక ఎంఐఎంకు మరో అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై 10 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి బిహార్ అసెంబ్లీకి పార్టీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేను పంపించింది. ఈ తొలి విజయం అందించిన ఊపుతో మరుసటి ఏడాది 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీతో పొత్తు పెట్టుకొని 20 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించి.. రాజకీయ విశ్లేషకుల దృష్టిని తన వైపునకు తిప్పుకొంది. ఈ ఐదింటిలో నాలుగు ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి చెందిన సిట్టింగ్ స్థానాలు కావటం విశేషం. తద్వారా, సెక్యులర్ పార్టీల ఓట్లను ఎంఐఎం కొల్లగొట్టి వాటికి నష్టం చేకూరుస్తుందన్న వాదనలు బయల్దేరాయి. తదనంతర కాలంలో, ఆ ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు పార్టీని వీడి ఆర్జేడీలో చేరారు. దీంతో, అసెంబ్లీలో ఎంఐఎంకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. 2022లో గోపాల్‌గంజ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన ఎంఐఎం 12,214 ఓట్లను సాధించి మూడోస్థానంలో నిలిచింది. ఈ ఎన్నికలో ఆర్జేడీ అభ్యర్థిపై గెలిచిన బీజేపీ అభ్యర్థి మెజారిటీ దాదాపు 2 వేలు మాత్రమే. అంటే, ఎంఐఎం ఓట్ల చీలికతోనే బీజేపీ గెలిచిందని, తద్వారా ఆ పార్టీకి పరోక్షంగా సాయపడుతోందన్న సందేహాలు పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి. మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం ప్రాధాన్యం కూడా పెరిగింది.
ఎంఐఎంతో పొత్తుకు లాలూ యోచన
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన కసరత్తులో భాగంగా.. ఎంఐఎంను మహాగఠ్‌బంధన్‌లోకి తీసుకోవటానికి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యోచించారు. అంతకుముందు ఆర్జేడీ తమ ఎమ్మెల్యేలను లాక్కొందనే ఆగ్రహం ఉన్నా.. అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగానే స్పందించారు. కానీ, కాంగ్రెస్ అడ్డుపుల్ల వేసిందని సమాచారం. ఈసారి, మైనారిటీ ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని ఆ పార్టీ.. ఎంఐఎంను కూడా కలుపుకొంటే కొన్ని సీట్లను వారికి ఇవ్వటానికి తిరస్కరించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఇండియా కూటమితో కలిసి పని చేయటానికి అసదుద్దీన్ సిద్ధం కాగా, ఆర్జేడీ అంగీకరించలేదు. అప్పుడు ఆర్జేడీ, ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎంను కూటమిలోకి రాకుండా అడ్డుకున్నాయి. కొన్ని చిన్నపార్టీలతో కలిసి పోటీకి దిగిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్. ఏకంగా వంద స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించినా 25 స్థానాలకే పరిమితమయ్యారు. తాము ముస్లింలకు పరిమితం కాదని చెప్పుకోవడానికి రెండింటిలో హిందువులకు అసదుద్దీన్ టికెట్లు ఇచ్చారు. బిహార్‌లో ముస్లిం ఓటు కీలకం. రాష్ట్ర జనాభాలో వారి వాటా 17.7ు. మొ త్తం 243 అసెంబ్లీ స్థానాల్లో సీమాంచల్‌లోని 24 సీట్లతో కలిపి 110 స్థానాల్లో ముస్లింల ప్రభావం ఉంది.