Migrant Worker Attacked: వలస కార్మికుడిపై కత్తులతో టీనేజర్ల దాడి
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:01 AM
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఒక వలస కార్మికుడిపై నలుగురు టీనేజర్లు దాడి చేశారు. విషయం వెలుగులోకి రావడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
బాధితుడు మహారాష్ట్ర వాసి..చెన్నై వద్ద ఘటన
చెన్నై, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఒక వలస కార్మికుడిపై నలుగురు టీనేజర్లు దాడి చేశారు. విషయం వెలుగులోకి రావడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నుంచి తిరుత్తణికి వెళ్తున్న సబర్బన్ రైలులో నలుగురు బాలుర బృందం ఒక వలస కార్మికుడిని వేదిస్తూ, దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయ్యాయి. నిందితుల్లో ఒకరు కత్తి చూపిస్తూ, ఒక తమిళపాటను బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌గా ఉపయోగించాడు. మరో వీడియోలో నిందితులు ఒక ఇంటి సమీపంలో బాధితుడిపై కత్తులతో దాడి చేయడం కనిపించింది. దాడి చేసిన వారిలో ఒకరు బాధితుడి పక్కన విక్టరీ గుర్తు చూపిస్తూ పోజు ఇచ్చాడు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడి, రక్తస్రావంతో ఉన్నాడు. అతడు ప్రస్తుతం తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు మహారాష్ట్రకు చెందిన కూలీగా పోలీసులు గుర్తించారు. కాగా, 17 ఏళ్ల వయసుగల నలుగురు నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిని చెంగల్పట్టులోని బాలల సంరక్షణ గృహానికి పంపగా, నాలుగో నిందితుడిని అతడి చదువును దృష్టిలో ఉంచుకుని కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం స్పందించారు. తమిళనాడు పోలీసులు తమ సత్తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ‘శక్తి ప్రదర్శన’ ఆపరేషన్ అవసరమని అభిప్రాయపడ్డారు.