Indian Air Force: మిగ్ శకం ముగిసే వేళాయె!
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:55 AM
భారత వాయుసేన (ఐఏఎ్‌ఫ)లో ఓ చారిత్రక అధ్యయనానికి తెరపడనుంది. ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతల రక్షణకు వెన్నుదన్నుగా నిలిచిన...
మిగ్-21 ఫైటర్ జెట్ల సేవలకు రేపే వీడ్కోలు
చండీగఢ్, సెప్టెంబరు 24: భారత వాయుసేన (ఐఏఎ్‌ఫ)లో ఓ చారిత్రక అధ్యయనానికి తెరపడనుంది. ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతల రక్షణకు వెన్నుదన్నుగా నిలిచిన మిగ్-21 సేవలకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. రష్యాకు చెందిన దిగ్గజ మిగ్-21 ఫైటర్ జెట్లు శుక్రవారం చండీగఢ్ ఎయిర్ బేస్‌లో జరిగే డీకమిషన్ కార్యక్రమంలో వాయుసేన నుంచి గౌరవంగా రిటైర్ కానున్నాయి. ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వీటికి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. ‘పాంథర్స్’ అనే మారుపేరుతో పిలిచే 23వ స్క్వాడ్రన్‌కు చెందిన చివరి మిగ్-21 బైసన్ యుద్ధ విమానంలో చివరిసారిగా ప్రయాణించి ‘బాదల్-3’ అనే కాల్‌సైన్‌తో వీడ్కోలు పలుకుతారు. మిగ్-21 యుద్ధ విమానం 1963లో తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టింది కూడా ఈ ఎయిర్‌ఫోర్స్ కేంద్రంలోనే. అప్పట్లో వింగ్ కమాండర్ దిల్బాగ్ సింగ్ దీనికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత 1981లో ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయికి ఎదిగారు. ఆరు దశాబ్దాలపాటు సేవలందించిన మిగ్-21ల వీడ్కోలుపై ఐఏఎఫ్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ‘ఆరు దశాబ్దాల సేవ.. లెక్కలేనన్ని ధైర్యసాహసాల కథలు.. ఒక దేశ ఆత్మగౌరవాన్ని గగతనలంలో మోసిన యుద్ధ గుర్రం’ అని ట్వీట్ చేసింది. శుక్రవారం జరిగే ఫ్లైస్టాప్ వేడుకలో పాల్గొనే 23వ స్క్వాడ్రన్‌కు చెందిన ఆరు మిగ్-21 జెట్లు ల్యాడింగ్ అయిన తర్వాత వాటికి జల ఫిరంగులతో అభివాదం చేస్తారు.