Heavy Rainfall: చెన్నైలో అర్ధరాత్రి కుండపోత
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:48 AM
చెన్నై మహానగరంలో శనివారం అర్ధరాత్రి కుండపోతగా వర్షం కురిసింది. రహదారులు, సబ్‌వేలు వరదతో పొంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
విమానసేవలకు అంతరాయం
చెన్నై, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): చెన్నై మహానగరంలో శనివారం అర్ధరాత్రి కుండపోతగా వర్షం కురిసింది. రహదారులు, సబ్‌వేలు వరదతో పొంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా నాలుగు విమానాలు చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కాలేకపోవటంతో వాటిని బెంగుళూరుకు మళ్లించారు. 27 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి 140 మంది ప్రయాణికులతో చెన్నైకు వచ్చిన ఇండిగో విమానం, 164 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిర్ ఇండియా, 74 మందితో వచ్చిన ఇండిగో, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి 268 మంది ప్రయాణికులతో వచ్చిన లుఫ్తాన్సా విమానాలను బెంగుళూరుకు మళ్లించారు. ఇదేవిధంగా కౌలాలంపూర్, హాంకాంగ్, తిరువనంతపురం, ఇండోర్, ఢిల్లీ నుంచి వచ్చిన విమానాలు కూడా ల్యాండ్ కాలేక సుదీర్ఘ సమయం పాటు గాలిలో చక్కర్లు కొట్టిన పిమ్మట వాతావరణం అనుకూలించిన మీదటే ల్యాండ్ అయ్యాయి. అదేవిధంగా చెన్నై నుంచి కౌలాలంపూర్, ఫ్రాంక్‌ఫర్ట్, హాంకాంగ్, శ్రీలంక, దుబాయ్, కువైట్, మస్కట్, సింగపూర్, ఢిల్లీ, పూణెతో సహా అనేక ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాల్సిన విమాన సర్వీసులు 3 గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి.