Share News

Microsoft CEO Satya Nadella: భారత్‌లో 1.58 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Dec 10 , 2025 | 03:06 AM

భారత్‌లో ఏఐ కృత్రిమమేధ రంగంలో 1750 కోట్ల డాలర్ల రూ.1.58 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు....

Microsoft CEO Satya Nadella: భారత్‌లో 1.58 లక్షల కోట్ల పెట్టుబడులు

  • ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల పెంపునకు సహకరిస్తాం

  • మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల.. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబరు 9: భారత్‌లో ఏఐ (కృత్రిమమేధ) రంగంలో 1750 కోట్ల డాలర్ల (రూ.1.58 లక్షల కోట్లు) పెట్టుబడులు పెడతామని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇది ఆసియాలోనే తమ కంపెనీకి సంబంధించి అతి పెద్ద పెట్టుబడి అని తెలిపారు. ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ఎక్స్‌లో ఒక ప్రకటన చేశారు. ‘భారత్‌ ఏఐ భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సర్వసత్తాక సామర్థ్యాలను పెంచుకోవటంలో సాయపడేందుకు ఈ పెట్టుబడులు పెట్టనున్నాం’ అని పేర్కొన్నారు. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. 2026-29 మధ్య నాలుగేళ్ల వ్యవధిలో 1750 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నామని, ఏఐని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని తెలిపింది. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ దిశగా భారత్‌ అడుగులు వేస్తున్న సమయంలో.. భారతీయ వినియోగదారులకు సర్వసత్తాక (సావరీన్‌) పబ్లిక్‌ క్లౌడ్‌, సావరీన్‌ ప్రైవేట్‌ క్లౌడ్‌ను తాము తీసుకొస్తున్నామని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఏఐలో శిక్షణ పొందిన మానవ వనరుల ద్వారానే భారత్‌ ఏఐ రంగంలో ముందడుగు వేయగలుగుతుందని పేర్కొంది. ఈ మేరకు 2030 నాటికి భారత్‌లో 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ అందిస్తామని వెల్లడించింది. అడ్వాంటేజ్‌(ఐ) ఇండియా కార్యక్రమం కింద ఇప్పటికే 56 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపింది. భారత్‌లో 300 కోట్ల డాలర్ల (రూ.26,955 కోట్ల) పెట్టుబడులు పెడతామని ఈ ఏడాది ప్రారంభంలో తాము చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. ఈ మొత్తాన్ని వచ్చే ఏడాది పూర్తయ్యేలోపు ఖర్చు చేస్తామని మైక్రోసాఫ్ట్‌ స్పష్టం చేసింది. కాగా, ప్రపంచ ఏఐ హబ్‌గా భారత్‌ నిలిచేందుకు మైక్రోసాఫ్ట్‌ తాజా పెట్టుబడులు తోడ్పడనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. క్లౌడ్‌ స్కేలింగ్‌, కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఏఐ స్కిల్‌ ప్రోగ్రామ్స్‌, డేటా సిస్టమ్‌ల భద్రత వంటి విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ పాలన, విద్య, ఆర్థిక సేవలు తదితర రంగాలకు భారత్‌ ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పెట్టుబడులను సమన్వయపర్చనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచం ఆధారపడదగిన టెక్నాలజీ భాగస్వామిగా భారత్‌ ఎదిగిన తీరుకు మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడుల ప్రకటన తాజా సంకేతమన్నారు. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి ఏఐ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌గా భారత్‌ వేస్తున్న ముందంజకు ఈ పెట్టుబడులు ఇతోధికంగా దోహదం చేస్తాయన్నారు.


తెలంగాణకు భారీగా వచ్చే అవకాశం

మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడుల్లో గణనీయమైన మొత్తం తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ‘ఇండియా సౌత్‌ సెంట్రల్‌ క్లౌడ్‌ రీజియన్‌’ను ఏర్పాటు చేస్తామని, 2026లో ఇది పని చేయటం ప్రారంభిస్తుందని మైక్రోసాఫ్ట్‌ గతంలోనే ప్రకటించింది. తాజా ప్రకటనలో ఈ అంశాన్ని గుర్తు చేస్తూ.. భారత్‌లో ఇదే తమ కంపెనీకి చెందిన అతిపెద్ద సెంటర్‌ అవుతుందని, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియానికి ఇది రెట్టింపు సైజులో ఉంటుందని తెలిపింది.

ఏడాదిలో మూడు భారీ పెట్టుబడులు

మైక్రోసాఫ్ట్‌ తాజా ప్రకటనతో.. ఏఐ రంగంలో ఈ ఏడాది భారత్‌లోకి మూడు భారీ పెట్టుబడులు వచ్చినట్లయ్యింది. దేశంలో ఏఐ హబ్‌ను నెలకొల్పుతామని, దీనికోసం రానున్న ఐదేళ్లలో 1500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని గూగుల్‌ ఈ ఏడాది అక్టోబరులో ప్రకటించింది. అదానీ గ్రూపుతో కలిసి దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు కూడా దీంట్లో భాగం. దీని తర్వాత.. బ్రూక్‌ఫీల్డ్‌, రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌, డిజిటల్‌ రియాల్టీ అనే మూడు కంపెనీలు సంయుక్తంగా డిజిటల్‌ కనెక్షన్‌ పేరిట 1100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ 1750 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడులపై ప్రకటన చేసింది.

Updated Date - Dec 10 , 2025 | 03:06 AM