Share News

Mexico has approved a bill to Raise Tariffs: భారత్‌, చైనా సహా పలు దేశాలపైమెక్సికో సుంకాల కొరడా

ABN , Publish Date - Dec 12 , 2025 | 03:55 AM

తమపై సుంకాల కొరడా ఝుళిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు.. మెక్సికో దేశం తమతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలూ....

Mexico has approved a bill to Raise Tariffs: భారత్‌, చైనా సహా పలు దేశాలపైమెక్సికో సుంకాల కొరడా

  • వాణిజ్య ఒప్పందం లేని దేశాలపై 50ు దాకా సుంకాల పెంపు బిల్లుకు ఓకే

న్యూఢిల్లీ, డిసెంబరు 11: తమపై సుంకాల కొరడా ఝుళిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు.. మెక్సికో దేశం తమతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలూ లేని దేశాలపై సుంకాల బాదుడుకు సిద్ధమైంది! 2026 జనవరి 1 నుంచి.. ఆయా దేశాల నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే ఆటోమొబైల్‌, ఆటో విడిభాగాలు, జౌళి, ప్లాస్టిక్‌, ఉక్కు ఉత్పత్తులపై సుంకాలను 50 శాతం దాకా పెంచుతూ రూపొందించిన బిల్లును మెక్సికో సెనెట్‌ బుధవారం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా ప్రభావితమయ్యేది భారత్‌, చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌, ఇండోనేసియా తదితర ఆసియా దేశాలే. భారత్‌, చైనాలపై ఇతర దేశాలు కూడా భారీగా సుంకాల భారం మోపాలని ట్రంప్‌ కోరుకుంటున్న సంగతి తెలిసిందే. 2020 జూలైలో కుదిరిన ‘అమెరికా-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం’పై 2026 జూలైలో సమీక్ష జరగనుంది. ఇప్పటికే మెక్సికోపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న ట్రంప్‌.. ఆ సమీక్షలో అమెరికాకు ప్రయోజనాలు కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే తమ దేశానికి నష్టమని భావించడం వల్లనే.. ఆయన్ను మెప్పించేందుకు మెక్సికో ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, మెక్సికో నేతలు మాత్రం తమ స్థానిక పరిశ్రమలు, తయారీదారులకు ఊతం ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. సుంకాల పెంపు వల్ల వచ్చే ఏడాది తమ దేశానికి రూ.33,910 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

భారత్‌పై ఏ మేరకు ప్రభావం అంటే..

మెక్సికోతో భారత్‌ వాణిజ్యం 2024లో గరిష్ఠంగా 11.7 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.1.05 లక్షల కోట్లకు) చేరింది. ఇందులో మెక్సికోకు భారత్‌ ఎగుమతుల విలువ 8.9 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.80 వేల కోట్లు) కాగా.. అక్కణ్నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల విలువ 2.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.25 వేల కోట్లు)గా ఉంది. మెక్సికన్‌ ఉత్పత్తులకు భారత్‌ తొమ్మిదో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇలాంటి సమయంలో మెక్సికో తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇరుదేశాల వాణిజ్యంపై పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా.. మనదేశం నుంచి మెక్సికో దిగుమతుల్లో కార్లు, ఆటో విడిభాగాలు, ఇతర వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. సుంకాల ప్రభావం వచ్చే ఏడాది వీటిపై ఎక్కువగా పడే ప్రమాదం ఉంది.

Updated Date - Dec 12 , 2025 | 03:55 AM