Share News

Indigo Crisis: రద్దులోనే విమానాలు

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:50 AM

దేశంలో విమానయాన సంక్షోభం కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు, విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతున్నాయి......

Indigo Crisis: రద్దులోనే విమానాలు

  • ఆదివారం 650 సర్వీసులు రద్దు చేసిన ఇండిగో

  • విమానాశ్రయాల్లోనే వేలాది మంది పడిగాపులు

  • సంక్షోభాన్ని సరిదిద్దేందుకు కమిటీ ఏర్పాటు చేశాం

  • ఆదివారం ఉదయానికల్లా 610 కోట్లు రిఫండ్‌ చేశాం

  • పదో తేదీకల్లా అన్ని సర్వీసులు నడుపుతాం: ఇండిగో

  • కేంద్ర విధానాల ఫలితమే ఇండిగో సంక్షోభం: కాంగ్రెస్‌

  • ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు: రామ్మోహన్‌

  • 5 వేల విమానాల రద్దు.. 8 లక్షల మందికి ఇబ్బంది

న్యూఢిల్లీ/ముంబై, డిసెంబరు 7: దేశంలో విమానయాన సంక్షోభం కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు, విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 650 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందులో శంషాబాద్‌ నుంచి 115 సర్వీసులు, బెంగళూరు నుంచి 150, ఢిల్లీ నుంచి 108 సర్వీసులు ఉండటం గమనార్హం. అయితే పరిస్థితిని సరిదిద్దుతున్నామని, బుధవారం నాటికి దాదాపు అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తామని ఇండిగో ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాల ఫలితమే ఇండిగో సంక్షోభమని కాంగ్రెస్‌ ఆరోపించింది. విమాన చార్జీలపై నియంత్రణలు కొనసాగించాలని డిమాండ్‌ చేసింది. ఇండిగో సంక్షోభంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడటం, ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. డీజీసీఏ ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో) ఇసిడ్రో పోర్కెర్‌సలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. భారీగా విమానాల రద్దుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా ఇండిగోపై చర్యలు చేపడతామని వెల్లడించింది. ఇక జేడీయూ ఎంపీ సంజయ్‌ ఝా నేతృత్వంలోని రవాణా, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం.. విమానయాన సంక్షోభంపై దృష్టిపెట్టినట్టు తెలిసింది. ప్రైవేటు విమానయాన సంస్థలు, డీజీసీఏ ఉన్నతాధికారులను పిలిపించి వివరణ కోరనున్నట్టు సమాచారం.

10వ తేదీకల్లా అన్ని సర్వీసులు

ఇండిగో విమాన సర్వీసుల పరిస్థితి మెరుగుపడుతోంది. మొత్తం 2,300 సర్వీసులకుగాను ఆదివారం దేశవ్యాప్తంగా 1,650 సర్వీసులను నిర్వహించామని, 650 విమానాలు రద్దయ్యాయని ఇండిగో ప్రకటించింది. క్రమక్రమంగా అన్నింటినీ మెరుగుపరుస్తూ వస్తున్నామని, బుధవారానికల్లా పూర్తిస్థాయి సర్వీసులు నిర్వహిస్తామని తెలిపింది. మొత్తం 138 ప్రాంతాలకుగాను 135 ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించినట్టు వివరించింది. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందిపడకుండా వీలైనంత ముందుగానే సమాచారం ఇస్తున్నామని పేర్కొంది. విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం ‘సంక్షోభ నిర్వహణ కమిటీ’ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికుల సొమ్మును వేగంగా తిరిగిస్తున్నామని, ఆదివారం ఉదయానికల్లా రూ.610 కోట్ల రీఫండ్లు చెల్లించామని తెలిపింది. ప్రయాణికులకు సంబంధించిన 3 వేల బ్యాగులను వారికి అందజేశామని వెల్లడించింది. కాగా, ఇండిగో విమానాల రద్దు కారణంగా.. ఎయిరిండియా నుంచి కనెక్టింగ్‌ విమాన టికెట్లు, రిటర్న్‌ టికెట్లు ఉన్నవారు వాటిని రద్దు చేసుకుని తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో దేశీయ ప్రయాణికులకు టికెట్ల రద్దు, ప్రయాణ తేదీ మార్పు కోసం చార్జీలను ఒకసారి మినహాయిస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.


సిబ్బందిని నిందించొద్దు: సోనుసూద్‌

ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో తమ కుటుంబం కూడా ఇబ్బందిపడిందని బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ చెప్పారు. అయితే, ‘‘కొందరు ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇండిగో సిబ్బందిపై అరవడం, తిట్టడం కనిపించింది. ఇది బాధాకరం. ఈ అంశంలో సిబ్బంది కూడా నిస్సహాయులే. అందువల్ల మనం బాధ్యతాయుతమైన పౌరులుగా వారితో మర్యాదగా వ్యవహరించాలి’’ అని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

5 రోజులు.. 5 వేల విమానాల రద్దు

ఈ నెల 2వ తేదీ నుంచి ఇండిగో విమాన సంక్షోభం మొదలైంది. 7వ తేదీనాటికి ఐదు రోజుల్లో మొత్తం 5 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు తీవ్రంగా ప్రభావం పడింది. పౌర విమానయాన అమల్లోకి తెచ్చిన ‘ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిట్‌ (ఎఫ్‌డీటీఎల్‌)’ నిబంధనల ప్రభావాన్ని సరిగా అంచనా వేయడంలో ఇండిగో విఫలమైందని పైలట్ల సంఘాలు తెలిపాయి. సంక్షోభం మొదలయ్యాక చూసుకుంటే ఏకంగా 300 మంది పైలట్లతోపాటు వారికి అనుబంధంగా ఉండాల్సిన సిబ్బంది కొరత ఏర్పడిందని, దానితో వందలాది విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.

రాజకీయం చేయొద్దు: రామ్మోహన్‌

కేంద్ర గుత్తాధిపత్య విధానాల కారణంగానే ఇండిగో సంక్షోభమన్న రాహుల్‌ వ్యాఖ్యలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ తప్పుబట్టారు. ఇండిగో సంక్షోభ పరిస్థితిని రాజకీయం చేయవద్దన్నారు. ‘‘విమానయాన రంగంలో పోటీని పెంచడానికి ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇండిగో సమస్య ప్రజలకు సంబంధించిన అంశం. రాజకీయ అంశం కాదు. ఏదైనా ప్రతిపక్ష నేత పూర్తిగా వివరాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది’’ అని రామ్మోహన్‌నాయుడు సూచించారు.

కేంద్ర గుత్తాధిపత్య విధానాల ఫలితమే: రాహుల్‌

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాల కారణంగానే విమానయాన సంక్షోభం నెలకొందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘‘ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాల కారణంగా సాధారణ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇండిగో సంక్షోభం ఆ గుత్తాధిపత్య మోడల్‌ ఫలితమే. భారత్‌లో ప్రతి రంగంలో ఆరోగ్యకరమైన, న్యాయమైన పోటీ ఉండాలి. అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ కుమ్మక్కు గుత్తాధిపత్య విధానాలతో కాదు..’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ సంక్షోభం కేవలం ఇండిగో సంస్థ తప్పిదం కాదని.. ఇది డీజీసీఏ, విమానయాన శాఖతోపాటు మొత్తం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని కాంగ్రెస్‌ నేత చిదంబరం విమర్శించారు.

Updated Date - Dec 08 , 2025 | 03:50 AM