Share News

Maoist Party Expels Leaders: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:08 AM

ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్‌, ఆశన్నలకు ప్రజలే శిక్ష విధిస్తారని మావోయిస్టు పార్టీ పేర్కొంది...

Maoist Party Expels Leaders: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు

  • వారిని ప్రజలే శిక్షిస్తారు.. ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం

  • మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

హైదరాబాద్‌, చర్ల, చింతూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్‌, ఆశన్నలకు ప్రజలే శిక్ష విధిస్తారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. వారి లొంగుబాటు విప్లవ ద్రోహమని మండిపడింది. వారితోపాటు లొంగిపోయినవారందరినీ మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు.. మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. మల్లోజుల భార్య గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోయిందని.. అప్పటి నుంచే ఆ రాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో ఆయనకు సంబంధాలు ఏర్పడినట్లు అనుమానిస్తున్నామని ఆ లేఖలో అభయ్‌ పేర్కొన్నారు. ఆయన కోవర్టు చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. 2011 చివరి నుంచి గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వచ్చిన దండకారణ్య విప్లవోద్యమం 2018 నాటికి తాత్కాలిక వెనకంజకు గురైందని, అప్పటి నుంచే మల్లోజులలో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయని తెలిపారు. 2020లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై ఆయన స్వీయ విశ్లేషణ చేస్తూ ఒక పత్రాన్ని ప్రవేశపెట్టారని, దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించిందని వివరించారు. తర్వాత పలుమార్లు జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో సమావేశాల్లో ఆయనను సరిదిద్దడానికి పార్టీ ప్రయత్నించినట్టు తెలిపారు. 2011 నుంచే మల్లోజుల తీవ్ర అహంభావాన్ని, పెత్తందారీతనాన్ని ప్రదర్శిస్తున్నారని.. దీంతో పార్టీ పలుమార్లు ఆయన్ను హెచ్చరించిందని వివరించారు. ఈ ఏడాది మేలో జరిగిన కగార్‌ దాడిలో పార్టీ కార్యదర్శి బసవరాజ్‌ మరణం తర్వాత మల్లోజులలో బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయని.. ఆయనలో ప్రాణభీతి ఏర్పడిందని అభయ్‌ పేర్కొన్నారు. ఆయుధాలను పార్టీకి అప్పగించాలని కేంద్ర కమిటీ చెప్పినప్పటికీ మల్లోజుల వాటిని శత్రువుకు అప్పగించి, విప్లవ ద్రోహిగా మారారని పేర్కొన్నారు. ఎందరో కామ్రేడ్స్‌ శత్రు బలగాలతో పోరాడి, ప్రాణాలు అర్పించి, వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను మళ్లీ శత్రువుకు అప్పగించడమంటే విప్లవకారులను హత్య చేయడమేనని.. హత్య చేయాలని సూచించడమేనని.. ఇది విప్లవ ఘాతుకమవుతుందని అభయ్‌ పేర్కొన్నారు. పార్టీలోని ఎంత మంది సరెండర్‌ అయినా పార్టీ మాత్రం శత్రువులకు సరెండర్‌ కాదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నామని అభయ్‌ లేఖలో పేర్కొన్నాడు. మల్లోజుల, ఆశన్నల్లో పెరిగిన మితవాద భావాలను సకాలంలో గుర్తించడంలో పార్టీ విఫలమైందన్న ఆయన.. ఈ వైఫల్యంపై సమీక్షించుకొని గుణపాఠాలు నేర్చుకుంటామని స్పష్టం చేశారు. విప్లవోద్యమంలో వెనుకంజలు తాత్కాలికమేనని.. పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తామని అభయ్‌ తెలిపారు.

Updated Date - Oct 20 , 2025 | 04:08 AM