Share News

Man Suffers Cardiac Emergency: ఒక్కరైనా స్పందించి ఉంటే....ఆ ప్రాణం నిలిచేదేమో?!

ABN , Publish Date - Dec 17 , 2025 | 03:45 AM

చికిత్సకోసం వాహనంపై వెళుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు... భర్తను కాపాడుకోవాలని అతని భార్య వాహనదారులను సాయం కోసం ఎంతగానో అర్థించింది......

Man Suffers Cardiac Emergency: ఒక్కరైనా స్పందించి ఉంటే....ఆ ప్రాణం నిలిచేదేమో?!

  • గుండెపోటుతో రోడ్డుపై విలవిలలాడిన వ్యక్తి

  • సాయం కోసం వాహనదారులను బతిమాలిన భార్య

  • మానవత్వం చూపని వైనం.. ప్రాణం విడిచిన బాధితుడు

బెంగళూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): చికిత్సకోసం వాహనంపై వెళుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు... భర్తను కాపాడుకోవాలని అతని భార్య వాహనదారులను సాయం కోసం ఎంతగానో అర్థించింది. కానీ, ఎవరూ స్పందించకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బెంగళూరు నగరంలోని బనశంకరి సమీపంలో ఈ నెల 13న చోటు చేసుకుంది. బనశంకరిలోని కదిరేనహళ్లికి చెందిన వెంకట రమణన్‌(34)కు ఈ నెల 13వ తేదీ తెల్లవారున 3.30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వచ్చి, వాంతి అయింది. భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై కత్రిగుప్పెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్‌లు లేకపోవడంతో సమీపంలోనే ఉండే మరో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఈసీజీ తీసి, మైల్డ్‌ హార్ట్‌ అటాక్‌ అని చెప్పారు. ప్రథమ చికిత్స చేసి, వెంటనే జయదేవ హృద్రోగ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లేందుకు వాహనం కోసం వెంకట రమణన్‌ భార్య ప్రయత్నించారు. దొరక్కపోవడంతో ద్విచక్రవాహనంపైనే బయలుదేరారు. కాస్త దూరం వెళ్లేసరికి వెంకట రమణన్‌ పరిస్థితి విషమించింది. వాహనాన్ని నడపలేక పోగా, ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలారు. ఆయన భార్యకు దిక్కుతోచక, సాయం కోసం రోడ్డున వెళుతున్న వాహనాలను ఆపేందుకు ప్రయత్నించారు. చేతులు జోడించి వేడుకున్నా వాహనాదారులు ఎవరూ ఆపలేదు. ఈ క్రమంలో వెంకట రమణన్‌ సోదరి అక్కడికి చేరుకుని సీపీఆర్‌ చేశారు. అప్పటికే పరిస్థితి విషమించింది. చివరకు ఓ క్యాబ్‌ డ్రైవర్‌ గమనించి, బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యలో వెంకట రమణన్‌ ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై నిలబడి భర్తను కాపాడుకునేందుకు మహిళ ప్రయత్నిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Updated Date - Dec 17 , 2025 | 03:45 AM