Human Bomb Threat: స్నేహితుడిపై పగతోనే ముంబైలో మానవబాంబులని బెదిరింపు
ABN , Publish Date - Sep 07 , 2025 | 07:27 AM
ముంబైలో తీవ్ర కలకలం రేపిన.. మానవబాంబులతో వరుస పేలుళ్లు బెదిరింపులకు సంబంధించి అశ్విన్ కుమార్ సుప్ర(50) అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని...
పోలీసులకు మెసేజ్ పంపిన వ్యక్తి అరెస్టు
నొయిడా, సెప్టెంబరు 6: ముంబైలో తీవ్ర కలకలం రేపిన.. మానవబాంబులతో వరుస పేలుళ్లు బెదిరింపులకు సంబంధించి అశ్విన్ కుమార్ సుప్ర(50) అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో పోలీసులు అరెస్టు చేశారు. వృత్తిరిత్యా జ్యోతిష్కుడైన అశ్విన్ కుమార్ తన స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి పేరు మీద ముంబై పోలీసులకు బాంబు బెదిరింపు మెసేజ్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. లష్కరే జిహాదికి చెందిన 14 మంది ముంబైలోకి ప్రవేశించారని, 400కిలోల ఆర్డీఎక్స్‌ను 34 వాహనాల్లో అమర్చామని వినాయక నిమజ్జనోత్సవం రోజున వాటిని పేలుస్తామంటూ ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు శుక్రవారం ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమై దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసు యంత్రాంగం ఆ సందేశాన్ని పంపిన అశ్విన్ కుమార్‌ను నొయిడా పోలీసుల సాయంతో అరెస్టు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దాని ప్రకారం.. బిహార్‌కు చెందిన ఫిరోజ్ అనే స్నేహితుడు పెట్టిన కేసులో అదే రాష్ట్రానికి చెందిన అశ్విన్ కుమార్ 2023లో మూడు నెలలు జైలులో గడిపాడు. అప్పట్నించి ఫిరోజ్‌పై అశ్విన్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఫిరోజ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి పేరు మీద ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్ పెట్టాడు. అశ్విన్ కుమార్ నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, ఆరు మెమురీ కార్డులు, రెండు డిజిటల్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.