Background Statistics: బిహార్ అసెంబ్లీలో సగం మందికిపైగా నేరచరితులే
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:45 AM
బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన 243 మంది కొత్త ఎమ్మెల్యేలలో 130 మంది (53ు)కి నేర చరిత్ర ఉంది.
న్యూఢిల్లీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన 243 మంది కొత్త ఎమ్మెల్యేలలో 130 మంది (53ు)కి నేర చరిత్ర ఉంది. వీరిలో 102 మందిపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. కొత్త ఎమ్మెల్యేలలో కేవలం 29 మంది మహిళలే (12శాతం) ఉన్నారు. గత అసెంబ్లీలో 26 మంది మహిళా ఎమ్మెల్యేలుండగా ఈసారి ముగ్గురు ఎమ్మెల్యేలు పెరిగారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ రూపొందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. శనివారం ఏడీఆర్ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. 2020 అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 163 మంది (68శాతం)పై క్రిమినల్ కేసులు ఉండగా.. ఈసారి 130 మందిపై క్రిమినల్ కేసులున్నాయని తెలిపింది. పార్టీలవారీగా చూస్తే అత్యధికంగా బీజేపీ ఎమ్మెల్యేలలో 54 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. జేడీయూలో 31, ఆర్‌జేడీలో 18, ఎల్‌జేపీ రామ్‌విలా్‌సలో 11, కాంగ్రెస్‌లో 4, ఎంఐఎంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. ఎమ్మెల్యేలలో ఆరుగురిపై హత్య కేసులు, 19 మందిపై హత్యాయత్నం కేసులు, 9 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నట్లు ఏడీఆర్ పేర్కొంది.