Drug seizure: బెంగళూరులో డ్రగ్స్ గోడౌన్లు
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:59 AM
బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ గోడౌన్లపై మహారాష్ట్రలోని కొంకణ్ మాదకద్రవ్య నియంత్రణ దళం(యాంటీ నార్కోటిక్స్ టాస్క్..
మహారాష్ట్ర పోలీసుల మెరుపు దాడి
55.88 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
బెంగళూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ గోడౌన్లపై మహారాష్ట్రలోని కొంకణ్ మాదకద్రవ్య నియంత్రణ దళం(యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్-ఏఎన్‌టీఎ్‌ఫ) అధికారులు ఆదివారం దాడులు చేశారు. రూ.55.88కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో డ్రగ్స్‌కు సంబంధించిన ఓ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నిందితులు ఆర్‌జే ఈవెంట్ పేరిట మాదకద్రవ్యాల తయారీ కేంద్రాలు, గోడౌన్లను కలిగి ఉన్నట్టు గుర్తించారు. ముంబైలో ఓ కేసులో 1.50 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అబ్దుల్ ఖాదర్ షేక్‌ను విచారించగా.. పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ఇచ్చిన సమాచారంతో బెళగావిలో ప్రశాంత్ యల్లప్ప పాటిల్‌ను అరెస్టు చేశారు. పాటిల్‌ను విచారించగా.. బెంగళూరులోని హొరమావు, యరప్పనహళ్లి, కణ్ణూరు ప్రాంతాలలో సింథటిక్ డ్రగ్స్ గోడౌన్లు, తయారీ, చిన్న ప్యాకెట్లుగా మార్చే యూనిట్లు ఉన్నట్టు తెలిపాడు. ఈమేరకు మహారాష్ట్ర పోలీసులు బెంగళూరులో మెరుపుదాడులు చేశారు. ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయి. 4.1 కేజీల ఘన రూపంలోని ఎండీఎంఏ, 17 కేజీల ద్రవరూపంలోని ఎండీఎంఏతో కలిపి 21.4 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.55.88 కోట్లు ఉంటుందని తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన సూరజ్ రమేశ్ యాదవ్, మల్కాన్ రామ్‌లాల్ బిష్ణోయ్‌తోపాటు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసుల ద్వారా తెలుస్తోంది. ఇటీవల బ్రెడ్ ప్యాకెట్లలో డ్రగ్స్‌ను అమర్చుకుని ముంబై నుంచి బెంగళూరుకు తీసుకొస్తున్న నైజీరియా మహిళను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓలాజిడె ఎస్తార్ అనే నైజీరియా మహిళ నుంచి రూ.1.20 కోట్ల విలువైన 121 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.