Share News

Mahatma Gandhi Rural Employment Guarantee Scheme: మహాత్మా గాంధీకి రాం రాం!

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:52 AM

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇక నుంచి దాన్ని వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌ గ్రామీణ్‌....

Mahatma Gandhi Rural Employment Guarantee Scheme: మహాత్మా గాంధీకి రాం రాం!

  • ఉపాధి హామీ పథకంలో జాతిపిత పేరు తొలగింపు

  • వీబీ-జీరామ్‌జీ పేరుతో లోక్‌సభలో ప్రభుత్వం బిల్లు

  • రాష్ట్రాలూ ఆర్నెల్లలో ఉపాధి హామీ చట్టాలు చేయాలి

  • వంద రోజుల నుంచి 125 రోజులకు ఉపాధి పెంపు

  • ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులు అని కోటా కేటాయింపు

  • మించి ఖర్చు పెట్టాలంటే రాష్ట్రాలే భరించుకోవాలి

  • పంచాయతీల అవసరాలకూ ఉపాధి హామీ వాడొచ్చు

  • వ్యవసాయ రద్దీ సీజన్‌లో ఉపాధికి హాలీడే ప్రకటించాలి

  • లోక్‌సభలో బిల్లు వివరాలు వెల్లడించిన మంత్రి చౌహాన్‌

  • గాంధీ పేరు తొలగింపునకు కారణం ఏమిటి: ప్రియాంక

  • చర్చను దారి మళ్లించేందుకే పేరు ఎత్తేశారు: సీపీఎం

న్యూఢిల్లీ, డిసెంబరు 15: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇక నుంచి దాన్ని ‘వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌-గ్రామీణ్‌’ (వీబీ-జీరామ్‌జీ) అని పిలుస్తారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును ఎత్తేస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ వీబీ-జీరామ్‌జీ 2025 బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో తీసుకొస్తున్న కొత్త బిల్లు నిబంధనలు వికసిత భారత్‌-2047 విజన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. పాత చట్టంలో వంద రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించడం(గ్యారెంటీ) ప్రధాన అంశం. కొత్త బిల్లులో గ్యారెంటీని 125 రోజులకు పెంచారు. 20 ఏళ్ల క్రితం పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితి ఇప్పుడు లేదని, మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని చౌహాన్‌ ప్రకటించారు. గ్రామీణ ప్రజలకు ఆదాయాన్ని ఇచ్చే ఉమ్మడి ఆస్తులను సరిపడా సృష్టించడం, వాటిపై అధికారాన్ని ఇవ్వడం పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ క్రమంలో వికసిత భారత్‌ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల సంపదను సృష్టిస్తారని వివరించారు. వ్యవసాయ పనుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూలీల కొరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలీడే ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనుల రద్దీ సీజన్‌ను గుర్తించి, ఉపాధి పనుల హాలీడే ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ నీటి వనరుల పునరుద్దరణ, కరవు, వరదల సమయంలో ప్రత్యేక పనుల ద్వారా ఉపాధి కల్పించడం లక్ష్యాలలో భాగమని తెలిపారు. వికసిత్‌ గ్రామ పంచాయత్‌ ప్రణాళికలో భాగంగా పంచాయతీ పనులకు కూడా ఉపాధి హామీని వాడుకోవచ్చు అని చెప్పారు.


కేంద్ర ప్రభుత్వ పథకమే అయినప్పటికీ కొత్త ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ చట్టం చేయాలని, ఆ చట్టం నిబంధనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని చౌహాన్‌ చెప్పారు. కొన్ని పరామితుల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి నిర్దిష్ట మొత్తాన్ని కేటాయిస్తామని, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన పరిమితికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు మొత్తాలను రాష్ట్రాలే భరించాల్సి ఉంటుందని వివరించారు. 2005లో పథకాన్ని ప్రవేశపెట్టినపుడు అది కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాత్రమే. 2009లో కాంగ్రెస్‌ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత పథకంలో కొన్ని మార్పులు చేశారు. ఆ సందర్భంగానే మహాత్మాగాంధీ పేరును పథకానికి చేర్చారు. తాజాగా మహాత్మాగాంధీ పేరును తీసేయడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. బాపూ పేరుతో బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏమిటని గ్రామీణాభివృద్ధి శాఖ స్థాయీ సంఘం చైర్మన్‌, కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి ఉల్కా ప్రశ్నించారు. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే ఈ పథకాన్ని గోతులు తీసే పథకంగా ఎద్దేవా చేశారని అన్నారు. ఈ పథకాన్ని ఎత్తేయడమే మోదీ లక్ష్యమని ఆరోపించారు. మారిన పరిస్థితులు, అదనంగా చేర్చిన పనులను దృష్టిలో పెట్టుకొని 150 రోజుల ఉపాధి గ్యారెంటీ ఇవ్వాలని స్థాయీ సంఘం ప్రతిపాదించిందని, దాన్ని 125 రోజులకు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ పేరును ఎత్తేయడం వల్ల ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనేకచోట్ల గాంధీ పేరును తొలగించాల్సి ఉంటుందని, స్టేషనరీ ఖర్చు దండగని ప్రియాంకగాంధీ వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలోనే అతి గొప్ప నాయకుడి పేరును తొలగించినపుడు ప్రభుత్వం వివరణ ఇస్తే బాగుంటుందని అన్నారు. పథకం ప్రధాన ఉద్దేశాన్ని సర్వనాశనం చేశారని, దానిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే గాంధీ పేరును తొలగించారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు.


పౌర అణు రంగంలోకి ప్రైవేటు సంస్థలు!

  • లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

పౌర అణు రంగంలోకి ప్రవేటు సంస్థలను అనుమతించే బిల్లు సహా మూడు బిల్లులను ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. శాంతి(ది సస్టైనబుల్‌ హార్నెస్సింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా) బిల్లును ీజితేంద్ర సింగ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పరమాణు ఇంధన చట్టం-1962, సివిల్‌ లయబిలిటీ రెజిం ఫర్‌ న్యూక్లియర్‌ డ్యామేజ్‌ చట్టం-2010ల స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. అణు ఇంధన రంగంలో లక్ష్యాలను సాధించేందుకు, అణు సాంకేతికతలో వినూత్న ఆవిష్కరణలు, విద్యుతేతర రంగాల్లో పౌర అణు విస్తరణ కోసం ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలకు స్వతంత్ర, స్వయం పాలన, స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ‘ది వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌ బిల్లు’ను విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వినియోగంలో లేని 71 చట్టాల రద్దుకు ఉద్దేశించిన ‘ది రిపీలింగ్‌ అండ్‌ అమెండింగ్‌ బిల్‌-2025ను న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ ప్రవేశపెట్టారు.

Updated Date - Dec 16 , 2025 | 05:52 AM