Share News

Family feud: చనిపోయిన ప్రియుణ్ని పెళ్లాడిన ప్రియురాలు

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:01 AM

ప్రేమకు కులం, మతం, దేశం వంటి హద్దులు లేవంటారు. కానీ, మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ఓ ఘటన ప్రేమకు ఏకంగా చావు కూడా అడ్డంకి కాదని నిరూపించింది....

Family feud: చనిపోయిన ప్రియుణ్ని పెళ్లాడిన ప్రియురాలు

నాందేడ్‌, నవంబరు 30: ప్రేమకు కులం, మతం, దేశం వంటి హద్దులు లేవంటారు. కానీ, మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ఓ ఘటన ప్రేమకు ఏకంగా చావు కూడా అడ్డంకి కాదని నిరూపించింది. తన ప్రియుడిని కుటుంబసభ్యులే దారుణంగా హత్య చేసినప్పటికీ ఆ 21 ఏళ్ల యువతి.. ప్రాణం పోయినా అతడే తన భర్త అంటూ మృతదేహాన్ని వివాహమాడింది. నవంబరు 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాందేడ్‌కు చెందిన ఆంచల్‌ మామిడ్వార్‌ తన సోదరుని స్నేహితుడైన సాక్షమ్‌ తాతే తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి బతకాలని కలలు కన్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో ఆంచల్‌ తండ్రి, ఇద్దరు సోదరులు ఈ బంధాన్ని వ్యతిరేకించారు. ఆంచల్‌ కుటుంబం నుంచి తీవ్ర బెదిరింపులు ఉన్నా, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారా ప్రేమికులు. వేరే కులం వాడి ని పెళ్లి చేసుకుంటే పరువుపోతుందని భావించిన ఆంచల్‌ కుటుంబ సభ్యులు.. సాక్షమ్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆంచల్‌ తండ్రి గజానన్‌, ఇద్దరు సోదరులు సాహిల్‌, హిమేశ్‌ మరో ఇద్దరితో కలిసి సాక్షమ్‌పై దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపి.. ఆ త ర్వాత రాయితో మోది దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఆంచల్‌ గుండెలవిసేలా రోదించింది. గత నెల 28న సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో సాక్షమ్‌ ఇంటికి చేరుకుంది. ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని.. తన ప్రేమకు మర ణం లేదని లోకానికి చాటాలని భావించింది. చనిపోయినా, బతికున్నా అతడే తన భర్త అంటూ.. ప్రియుడి మృతదేహంపై పసుపు పూసి, తన నుదుటిపై సిందూరం దిద్దుకుని.. జీవితాంతం సాక్షమ్‌ భార్యగా అతని ఇంట్లోనే బతుకుతానని ప్రతిజ్ఞ చేసింది. తన తండ్రి, సోదరులను ఉరి తీయాలని ఆమె డిమాండ్‌ చేసింది.

Updated Date - Dec 01 , 2025 | 05:01 AM