Polavaram Project: వరద జలాల్లో రాష్ట్రాల వాటాను తేల్చండి
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:50 AM
గోదావరిలో వరద జలాలపై ప్రతి రాష్ట్రానికి అధికారం ఉంటుందని, పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వరద జలాలపై ప్రతిపాదించినందున..
వాటి ఆధారంగా ప్రాజెక్టులను పరిశీలిస్తే మా ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా ఇస్తాం
పోలవరం-బనకచర్లపై మహారాష్ట్ర మెలిక
కేంద్ర జలశక్తి శాఖకు లేఖ
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గోదావరిలో వరద జలాలపై ప్రతి రాష్ట్రానికి అధికారం ఉంటుందని, పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వరద జలాలపై ప్రతిపాదించినందున.. వరద జలాల్లోనూ రాష్ట్రాల వాటాను తేల్చాలని మహారాష్ట్ర స్పష్టం చేసింది. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్)పై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర జలశక్తి శాఖ గోదావరి జలాలను పంచుకునే రాష్ట్రాలను కోరగా.. మహారాష్ట్ర లేఖ ద్వారా పై విధంగా తెలియజేసింది. వరద ఆధారిత ప్రాజెక్టుల ను పరిశీలించడానికి కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)వద్ద ఏమైనా మార్గదర్శకాలు ఉంటే.. మహారాష్ట్ర కూడా డీపీఆర్‌లను సమర్పిస్తుందని, అందుకు తగిన సమాచారం అందించాలని కోరింది. గోదావరి ట్రైబ్యునల్‌లోని క్లాజ్-4 ప్రకారం కేటాయింపులు ఉంటే.. వాటి ప్రకారం దక్కిన గోదావరి జలాలను ఏ ప్రాంతానికైనా తరలించే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్షం ఉందని, ఆ కరువు పీడిత ప్రాంతాలకు వరద జలాలను మళ్లించడానికి ప్రాజెక్టులు చేపడతామని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి వరదల సమయంలో రోజుకు 2 టీఎంసీల చొప్పున 243 టీఎంసీలను తరలించడానికి వీలుగా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిన విషయం విదితమే. దాంతో ఆ ప్రాజెక్టు ద్వారా తరలించే జలాలను కృష్ణా నదిలో పోస్తున్నందున. ఆ నదిని పంచుకునే రాష్ట్రాలకు కృష్ణా ట్రైబ్యునల్-1లోని క్లాజ్-14(బీ) ప్రకా రం ఆ నీటిని కోరే అధికారం ఉంటుందని మహారాష్ట్ర పేర్కొంది. ఈ క్లాజు ఆధారంగానే పోలవరం నుంచి కృష్ణా డెల్టా సిస్టమ్(కేడీఎ్‌స)కు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీలు వినియోగించుకోవడానికి వీలు కల్పించారని, ఇలా ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీల నీటి ని వినియోగించుకునే హక్కు లభించిందని గుర్తుచేసింది. ఈ లెక్కన 243 టీఎంసీల నీటిని తరలించాలని యోచిస్తున్నందున.. ట్రైబ్యునల్‌లోని క్లాజు ఆధారంగా ఆ నీటిని అన్ని రాష్ట్రాలకు పంచాలని తెలిపింది. అలాగే గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా మరో నాలుగు ఇంట్రా లింక్‌ల ద్వారా గోదావరి జలాలను ఏపీ తరలిస్తున్నందున.. ఆ నీటిలో కూడా మహారాష్ట్రకు వాటా ఇవ్వాలని కోరారు. నాలు గు ఇంట్రాలింక్‌ల కింద తరలించే నీటిలో వాటాతో పాటు పోలవరం-బనకచర్ల కింద తరలించే నీటిలో మహారాష్ట్రకు తగిన వాటాను కేటాయించాలని కోరింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల అనుసంధానం డీపీఆర్ తయారీ కోసం టెండర్లు పిలుస్తూ ఈ నెల 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టును ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లాలనిఏపీ యోచిస్తున్న విషయం విదితమే.