Share News

Rains Cause Chaos: మహారాష్ట్రలో వర్ష బీభత్సం

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:14 AM

మహారాష్ట్రలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా నాందేడ్‌ జిల్లాలో 8మంది చనిపోయారు...

Rains Cause Chaos: మహారాష్ట్రలో వర్ష బీభత్సం

  • థానేలో 8మంది మృతి

  • ముంబైలో మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30సెం.మీ వాన

  • 250కి పైగా విమానాలపై ప్రభావం

ముంబై, ఆగస్టు 19: మహారాష్ట్రలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా నాందేడ్‌ జిల్లాలో 8మంది చనిపోయారు. ముంబైలో మంగళవారం రికార్డు స్థాయిలో 30సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెగని వర్షాలతో ముంబైలో అన్ని రకాల ప్రయాణ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే (లేదా) ఎయిర్‌పోర్టుకు వచ్చే దాదాపు 250విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. ఎనిమిది విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. విమాన సర్వీసులు సగటున 45నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముంబైలో మిథీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఐదు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ నుంచి కుర్లా రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై 8అంగుళాల ఎత్తులో నీరు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రైలు సర్వీసులను నిలిపివేశారు. ముంబైలో ఆగస్టులో కురిసే మొత్తం సగటు వర్షపాతంలో దాదాపు సగం వాన ఈ రెండు రోజుల్లోనే కురిసిందని అధికారులు వెల్లడించారు. స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. బాంబే హైకోర్టు కూడా బుధవారం మధ్యాహ్నం 12.30గంటల వరకే పని చేసింది. వర్షాలతో మహారాష్ట్రలో 10లక్షల ఎకరాల పంట నీట మునిగింది. మరోవైపు, భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కొంకణ్‌ తీరంలోని ముంబై, థానే, రాయగఢ్‌, రత్నగిరి, పాల్ఘఢ్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. బుధవారం ఈ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాలతో ముంబైలో మోనో రైలు మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో అందులో దాదాపు 500మంది ప్రయాణికులు ఉన్నారు. కరెంటు సరఫరాలో సమస్యతోనే రైలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. మైసూరు కాలనీ, భక్తి పార్క్‌ స్టేషన్ల మధ్య సాయంత్రం 6.15గంటలకు రైలు ఆగిపోయింది. ప్రయాణికులు రెండు గంటల పాటు అందులోనే ఉండిపోయారు. అధికారులు కిటికీలు పగులగొట్టి క్రేన్లు, నిచ్చెనల సాయంతో వారిని కిందికి దింపారు.

Updated Date - Aug 20 , 2025 | 04:14 AM