Madras High Court: తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారా
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:14 AM
ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించేందుకు మూకుమ్మడిగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించిన ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు మద్రాస్ హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది.
ముగ్గురు పోలీసులపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం.. రూ.10 లక్షలు జరిమానా
నెల రోజుల్లో బాధితునికి ఇవ్వాలన్న బెంచ్
పోలీసులపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఆదేశం
చెన్నై, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించేందుకు మూకుమ్మడిగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించిన ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు మద్రాస్ హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆమొత్తాన్ని నెల రోజుల్లో బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. అంతేగాక ఆ ముగ్గురిపైనా శాఖాపరమైన విచారణ జరిపి, నెల రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని, ఆ వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. తప్పుడు సాక్ష్యాల కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిపై ఉన్న కేసును కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ కేకే రామకృష్ణన్ ఇటీవల తీర్పు వెలువరించారు. 2021 జూన్ 26వ తేదీన మదురై నగరంలోని ధిడీర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైకు ఓ ప్రాంతంలో గంజాయి అక్రమ వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం అందింది. ఆ మేరకు తన బృందంతో కలిసి వెళ్లిన ఎస్సై.. అక్కడ 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏ1 ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన కిందికోర్టు 2023 మార్చి 15వ తేదీన కొంతమంది నిందితులను జువెనల్‌కు తరలించింది. దీనిని సవాల్ చేస్తూ ఒకరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీలుపై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెల్లడించింది. ఈ కేసులో సహనిందితుడైన ఏ1 ఇచ్చిన సమాచారం తప్ప అప్పీలుదారు వద్ద గంజాయి ఉన్నట్టు నిరూపించే ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. గంజాయి స్వాధీనం చేసుకున్న సమయంలో ఎస్సై తన చేతిరాతతో రికార్డు రాసినట్టు పేర్కొన్నారని, కానీ కోర్టులో టైప్ చేసిన పత్రాలు సమర్పించారని తద్వారా ఆ పత్రం కల్పితమైనదని తేలిపోయిందని పేర్కొంది.