Share News

LPG Cylinder: గ్యాస్‌ సిలిండర్‌కూ పోర్టబులిటీ!

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:03 AM

మీ వంట గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే కంపెనీతో/ఏజెంట్‌తో ఇబ్బందులున్నాయా? అయితే, వారిని వెంటనే మార్చేసుకోండి. మొబైల్‌ నంబరును ఇష్టమొచ్చిన సర్వీస్‌...

LPG Cylinder: గ్యాస్‌ సిలిండర్‌కూ పోర్టబులిటీ!

  • అభిప్రాయ సేకరణ చేస్తున్న పీఎన్‌జీఆర్‌బీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: మీ వంట గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే కంపెనీతో/ఏజెంట్‌తో ఇబ్బందులున్నాయా? అయితే, వారిని వెంటనే మార్చేసుకోండి. మొబైల్‌ నంబరును ఇష్టమొచ్చిన సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఎలా మార్చుకోవచ్చో అలాగే ఇకపై గ్యాస్‌ ఏజెన్సీని కూడా మార్చేసుకోవచ్చు. ఈ సేవలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్యాస్‌ ఏజెన్సీలను మార్చుకునేందుకు మొబైల్‌ పోర్టబులిటీ తరహా సేవలను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వినియోగదారులు, భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2013లోనే పైలట్‌ ప్రాజెక్టు కింద 24 జిల్లాలో పోర్టబులిటీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత 2014లో 13 రాష్ట్రాల్లోని 480 జిల్లాల్లో ఈ పైలట్‌ ప్రాజెక్టును విస్తరించింది. ఆ పైలట్‌ ప్రాజెక్టులో కూడా గ్యాస్‌ ఏజెన్సీలను మార్చుకోగలరు కానీ, కంపెనీలను మార్చుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ, ఇకపై ఏజెన్సీలతో పాటు కంపెనీలను కూడా మార్చుకునేలా ఇంటర్‌ పోర్టబులిటీ సేవలను అందుబాటులోకి తేవాలని పీఎన్‌జీఆర్‌బీ నిర్ణయించింది. ఈ మేరకు భాగస్వామ్య పక్షాలు, వినియోగదారుల నుంచి అభిప్రాయ సేకరణను మొదలుపెట్టింది. ఆ తర్వాత నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించి దేశ వ్యాప్తంగా ఎల్‌పీజీ పోర్టబులిటీ సేవల అమలుకు ఒక తేదీని నిర్ణయిస్తామని వెల్లడించింది.

Updated Date - Sep 29 , 2025 | 03:03 AM