Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:51 AM
ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది..
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025’ పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు కొంత మంది బానిస కావడం, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాల వంటివి ఇటీవల చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇందులో పేర్కొన్న నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్‌లైన్ గేమ్స్ అందించే వారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి దాకా జరిమానా విధిస్తారు. ఆన్‌లైన్ గేమ్స్ ప్రకటనల్లో భాగస్వాములకు సైతం రెండేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు.