Supreme Court: రుణాల వసూలు సమస్యలు సివిల్ వివాదాలే
ABN , Publish Date - Sep 24 , 2025 | 02:54 AM
తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడం సివిల్ వివాదం కిందికి వస్తుందని, వాటిని క్రిమినల్ కేసులుగా మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది..
వాటిని క్రిమినల్ కేసులుగా మార్చొద్దు
కోర్టులు రికవరీ ఏజెంట్లు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడం సివిల్ వివాదం కిందికి వస్తుందని, వాటిని క్రిమినల్ కేసులుగా మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రుణాలు వసూలు చేసి ఇవ్వడానికి కోర్టులేమీ రికవరీ ఏజెంట్లు కాదని వ్యాఖ్యానించింది. అరెస్టులు చేయిస్తామని బెదిరించి, అందుకు అనుగుణంగా కేసులు పెట్టించి రుణాలు వసూలు చేసుకోవడం ఇటీవల కాలంలో అధికమైందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇరు పక్షాలు కూడా సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చుకుంటున్నాయని తెలిపింది. అప్పు వసూలు వివాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిపై కిడ్నాప్ కేసు నమోదు చేయడంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇలాంటి సందర్భాల్లోనే పోలీసులు విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ నేరంగా మార్చితే అది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్టు అవుతుందని తెలిపారు. ఇలాంటి సమస్యలపై సలహాలు ఇవ్వడానికి ప్రతి జిల్లాలో రిటైర్డు జడ్జీలను సలహాదారులుగా నియమించుకుంటే మంచిదని, దీనిపై 2వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించారు.