Lawyer Rakesh Kishore: దేవుడే నాతో చేయించాడు!
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:36 AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై కోర్టు రూమ్‌లో సోమవారం బూటు విసిరేసిన ఘటనపై భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు....
నేను నిమిత్త మాత్రుడిని
సీజేఐపై బూటు విసిరేయత్నంపై న్యాయవాది రాకేశ్ కిశోర్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, అక్టోబరు 7: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై కోర్టు రూమ్‌లో సోమవారం బూటు విసిరేసిన ఘటనపై(భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.) న్యాయవాది రాకేశ్ కిశోర్ స్పందించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి చింతా లేదని తెలిపారు. అంతేకాదు.. తన చర్యను సమర్థించుకున్నారు. ‘‘విష్ణుమూర్తి విగ్రహం’ పిల్‌పై సీజేఐ చేసిన వ్యాఖ్యలతో నా మనసు గాయపడింది. ‘వెళ్లు.. తలను పునరుద్ధరించమని ఆ విగ్రహాన్నే వేడుకో!.’ అని సీజేఐ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి. ఇదొక్కటే కాదు. జల్లికట్టు, నూపుర్ శర్మ, ఉట్టి ఎత్తు(శ్రీకృష్ణ జన్మాష్ఠమి రోజు నిర్వహిస్తారు.)లపై దాఖలైన పిటిషన్లపై ఇచ్చిన ఆదేశాలు కూడా నన్ను మనోవేదనకు గురిచేశాయి. ఇతర మతాలకు సంబంధించిన పిటిషన్లపై మాత్రం కోర్టు భిన్నంగా స్పందిస్తోంది.’’ అని రాకేశ్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మానికి సంబంధించిన పిటిషన్లలో పరిష్కారం చూపకపోయినా ఫర్వాలేదని, కానీ, అవహేళన మాత్రం చేయొద్దన్నారు. ‘‘తొలుత ఆయన సనాతనుడు. తర్వాత బౌద్ధంలోకి మారారు. ఇప్పుడు ఆయన దళిత బిడ్డనని చెప్పుకొంటారు. ఆయన దళితుడా?. ఇదీ వాళ్ల రాజకీయం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఎట్టి పరిస్థితిలోనూ క్షమాపణలు చెప్పను. భగవంతుడే నాతో ఈ పనిచేయించాడు. ఆయనే (దేవుడు) నన్ను జైలుకు పంపించినా వెళ్తా. లేదా.. ఉరి వేయించినా భరిస్తా. అంతా ఆయన ఇష్టం’’ అని చెప్పారు.