Share News

Latvian Women: అద్దెకు భర్త కావాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:10 AM

ఉత్తర ఐరోపాలోని లాత్వియా దేశంలో పురుషులకు డిమాండ్‌ పెరిగిపోయింది. పెళ్లి చేసుకునేందుకు, ఇంటి పనుల్లో సాయం చేసేందుకు భాగస్వామి దొరక్క మగ తోడు కోసం ఆ దేశ....

Latvian Women: అద్దెకు భర్త కావాలి

  • పురుషుల జనాభా తగ్గిపోవడంతో లాత్వియా మహిళల అవస్థ

  • ఇంటి పనుల్లో చేదోడు కోసం భర్తను అద్దెకు తెచ్చుకుంటున్న స్త్రీలు

న్యూఢిల్లీ, డిసెంబరు 5: ఉత్తర ఐరోపాలోని లాత్వియా దేశంలో పురుషులకు డిమాండ్‌ పెరిగిపోయింది. పెళ్లి చేసుకునేందుకు, ఇంటి పనుల్లో సాయం చేసేందుకు భాగస్వామి దొరక్క మగ తోడు కోసం ఆ దేశ మహిళలు నానాపాట్లు పడుతున్నారు. గత్యంతరం లేక ఇంటి పనుల్లో తమకు చేదోడువాదుడోగా ఉండేందుకు భర్తలను గంటలు, రోజులు లెక్కన అద్దెకు తెచ్చుకుంటున్నారు. లింగ నిష్పత్తిలో తేడా భారీగా పెరిగిపోవడం వల్లే ఆ దేశంలో ఈ వింత పరిస్థితి నెలకొందని ‘ది న్యూయార్క్‌ పోస్ట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. లాత్వియాలో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా 15.5 శాతం అధికంగా ఉంది. ప్రతీ వంద మంది పురుషులకు 115 మంది స్త్రీలు ఉన్నారు. అదే 65 ఏళ్లు అంతకంటే పైబడిన వారి విషయంలోనైతే పురుషుల కంటే స్త్రీలు రెండు రెట్లు అధికంగా ఉన్నారు. దీంతో తమ రోజువారీ జీవితంలో మగాళ్లే లేకుండా పోయారని, పని ప్రదేశంలో ఎటు చూసినా మహిళలే కనిపిస్తున్నారని ఆ దేశ స్త్రీలు వాపోతున్నారు. దేశంలో మగవారి కొరత వల్ల భాగస్వామి కోసం విదేశాలను ఆశ్రయించాల్సి వస్తుందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి పనుల్లో చేదోడు కోసం లాత్వియా మహిళలు భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా భర్తను బుక్‌ చేసుకొని వచ్చిన వారితో కలిసి ఇంటి పనులను పూర్తి చేసుకుంటున్నారు. లాత్వియా లింగ నిష్పత్తిలో భారీ తేడా రావడానికి పురుషుల ఆయుర్దాయం తగ్గిపోవడమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధూమపానం అలవాటు, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలే లాత్వియాలో పురుషుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణాలని చెబుతున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 04:10 AM