Lashkar e Taiba Commander: అవును..సిందూర్‌తో దెబ్బతిన్నాం
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:06 AM
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కుదేలైన ఉగ్రవాద సంస్థలు ఒక్కొక్కటిగా ఈ వాస్తవం అంగీకరిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ...
లష్కరే తాయిబా కమాండర్ ఒప్పుకోలు
ఇస్లామాబాద్, సెప్టెంబరు 19: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కుదేలైన ఉగ్రవాద సంస్థలు ఒక్కొక్కటిగా ఈ వాస్తవం అంగీకరిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఈ ఏడాది మే ఏడోతేదీన భారత బలగాలు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇందులో మురిద్కేలోని మర్కజ్ ఇ తాయిబాలోని లష్కరే ప్రధాన స్థావరం ఒకటి. భారత్ జరిపిన దాడిలో తమ స్థావరం నేలమట్టమైందని లష్కరే కమాండర్ ఖాసిం అంగీకరించాడు. దీనిపై ఆయన ఒక వీడియో విడుదలచేశాడు. ‘‘ప్రధాన స్థావరం మర్కజ్ ఇ తాయిబా శిథిలాలపై నేను నిలబడ్డాను. భారత బలగాల దాడుల్లో ఇది ధ్వంసమైంది. దీనిని పునర్నిర్మాణం చేసే పనులు కొనసాగుతున్నాయి. దేవుని అనుగ్రహంతో గతంలోని నిర్మాణం కంటే కూడా పెద్దగా దీనిని నిర్మిస్తాం.’’ అని ఖాసిం తెలిపాడు. ఎంతోమంది ఉగ్రవాదులు ఇక్కడ గతంలో శిక్షణ పొందారని చెప్పాడు.