US Case of A Woman and Child: హంతకుడిని పట్టించిన ల్యాప్‌టాప్
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:26 AM
అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మహిళ నర్రా శశికళ, ఆమె కుమారుడి హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. శశికళ భర్తతో కలిసి పనిచేసే నజీర్ హమీదే అసలు హంతకుడని తాజాగా గుర్తించారు...
అమెరికాలో ఆంధ్రా మహిళ హత్య కేసులో ట్విస్ట్
న్యూఢిల్లీ/పర్చూరు, నవంబరు 19: అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మహిళ నర్రా శశికళ, ఆమె కుమారుడి హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. శశికళ భర్తతో కలిసి పనిచేసే నజీర్ హమీదే అసలు హంతకుడని తాజాగా గుర్తించారు. అతని ల్యాప్‌టాపే అతన్ని పట్టించింది. బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు కాగ్నిజెంట్‌లో పనిచేస్తూ నూజెర్సీలోని మేపుల్ షేడ్‌లో తన అపార్టుమెంట్‌లో భార్య శశికళ (38), కుమారుడు అనీశ్ సాయి (6)తో కలసి నివసించేవారు. 2017 మార్చి 23న శశికళ, అనీశ్ హత్యకు గురయ్యారు. పోలీసులు.. తొలుత భర్తనే అనుమానించారు. కానీ ఆధారాల్లేకపోవడంతో విడిచిపెట్టారు. అయితే, హత్య జరిగిన ప్రదేశంలో వేరొకరి రక్తం, డీఎన్‌ఏను అఽఽధికారులు కనిపెట్టారు. దర్యాప్తు క్రమంలో హనుమంతరావుకు, కాగ్నిజెంట్ సహోద్యోగి నజీర్ హమీద్‌కు భేదాభిప్రాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన 6నెలల తర్వాత హమీద్ అమెరికా వదిలి భారత్‌కు వచ్చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తూ కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కొనసాగిస్తున్నాడు. హత్య కేసులో విచారించేందుకు హమీద్ డీఎన్‌ఏ నమూనాను సేకరించడానికి అమెరికా అధికారులు భారత అధికారులను సంప్రదించారు. కానీ హమీద్ నిరాకరించాడు. అయితే అతని ల్యాప్‌టాప్ నుంచి డీఎన్‌ఏ నమూనా సేకరించడానికి 2024లో కోర్టు నుంచి అనుమతి పొంది.. హమీద్ ల్యాప్‌టా్‌పను పంపాలని కాగ్నిజెంట్‌ను కోరారు. వారు పంపిన మీదట ల్యాప్‌టాప్ ఆధారంగా హామీద్ డీఎన్‌ఏను, హత్య ప్రదేశంలో కనుగొన్న నెత్తుటి నమూనాలను సరిపోల్చారు. ఆ గుర్తుతెలియని నెత్తురు నమూనా హమీద్‌దేనని గుర్తించారు. దీనితో తాజాగా అతనిపై కేసు నమోదు చేశారు.