Share News

Statehood Demand: లద్ధాఖ్‌కు చైనా ముప్పు!?

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:38 AM

లద్ధాఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తే సరిహద్దుల్లో ఉన్న చైనా, పాకిస్థాన్‌ నుంచి సమస్యలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా!...

Statehood Demand: లద్ధాఖ్‌కు చైనా ముప్పు!?

  • పూర్తిస్థాయి రాష్ట్ర హోదాతో సమస్యలు

  • ఆరో షెడ్యూల్‌లో చేరిస్తే మణిపూర్‌ వంటి ప్రాంతాల నుంచీ డిమాండ్లు

న్యూఢిల్లీ, అక్టోబరు 4: లద్ధాఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తే సరిహద్దుల్లో ఉన్న చైనా, పాకిస్థాన్‌ నుంచి సమస్యలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా!? లద్ధాఖ్‌ను ఆరో షెడ్యూల్‌లో చేరిస్తే.. మిగిలిన ప్రాంతాల నుంచీ ఇటువంటి డిమాండ్లే వస్తాయని అనుమానిస్తోందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ కారణంగానే చర్చల పేరిట కేంద్ర హోం శాఖ కాలయాపన చేస్తోందని ఆరోపిస్తున్నారు. నిజానికి, 2019 వరకూ లద్ధాఖ్‌కు పరిమితి స్వయం ప్రతిపత్తి మాత్రమే ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగిన రెండు మండళ్ల ద్వారా ఇక్కడ పాలన సాగేది. అయితే, 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి జమ్ము కశ్మీరును కేంద్ర పాలిత ప్రాంతంగా.. లద్ధాఖ్‌ను శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంతో ఈ మండళ్లు బలహీనమయ్యాయి. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అప్పుడు సామాజిక, రాజకీయ, మతపరమైన వ్యక్తులతో లే అపెక్స్‌ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (కేడీఏ) ఏర్పడ్డాయి. లద్ధాఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఈ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని ఉద్యమం ప్రారంభించాయి. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం శాఖ 2023 జనవరిలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కానీ, దాని పనితీరు నత్తను మరిపిస్తోంది. కమిటీ సమావేశం ఈనెల ఆరో తేదీన అంటే, సోమవారం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే, లద్ధాఖ్‌ను ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న శాంతియుత ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో సోమవారంనాటి జరుగుతుందా లేదా అనేదీ అనుమానమే. దీనికితోడు, లద్ధాఖ్‌లో పూర్తిస్థాయి శాంతి నెలకొనే వరకూ చర్చలకు దూరంగా ఉంటామని ఎల్‌ఏబీ, కేడీఏ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో.. ఇటు చైనా, అటు పాకిస్థాన్‌ సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతంలో లద్ధాఖ్‌ ఉండడంతో దానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం లేదా ఆరో షెడ్యూల్‌లో చేర్చడంపై మోదీ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 03:38 AM