Human Kidney Functions: ల్యాబ్‌లో తయారైన మానవ కిడ్నీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 03:03 AM
కృత్రిమ అవయవాల వైద్యం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన ఓ మానవ మూత్రపిండం నమూనా వైద్య చరిత్రలోనే అత్యధిక రోజులు క్రియాశీలకంగా ఉండి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ..
34 వారాలు క్రియాశీలకంగా మూత్రపిండం
ఇజ్రాయెల్ ఆస్పత్రి వైద్యుల సృష్టి
న్యూఢిల్లీ, ఆగస్టు 26: కృత్రిమ అవయవాల వైద్యం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన ఓ మానవ మూత్రపిండం నమూనా వైద్య చరిత్రలోనే అత్యధిక రోజులు క్రియాశీలకంగా ఉండి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ కిడ్నీ ఆర్గనాయిడ్‌ను ఇజ్రాయెల్ డాక్టర్లు ఓ ల్యాబ్‌లో తయారు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆ కిడ్నీ రికార్డు స్థాయిలో 34 వారాలకు పైగా పనిచేసింది. ఇది అవయవాల పునరుత్పత్తి వైద్యంలో ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. దీర్ఘకాలం ఉన్న కిడ్నీని ల్యాబ్‌లో సృష్టించడం విజయవంతమైన నేపథ్యంలో ఇక క్లినికల్ పరీక్షలకు సిద్ధమవుతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రఖ్యాత ఎంబో జర్నల్ ఆ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్‌లోని టెల్ హషోమెర్‌లో ఉన్న షెబా మెడికల్ సెంటర్ బృందం, టెల్ అవీవ్ యూనివర్సిటీతో కలసి 3డీ సింథటిక్ కిడ్నీని అభివృద్ధి చేసింది. గతంలో ఇలాంటి కృత్రిమ కిడ్నీలు నాలుగు వారాలు మాత్రమే ఉంటే.. ఇది అంత కంటే చాలా ఎక్కువ కాలం పనిచేసింది. అయితే ఇది ఇంకా అవయవ మార్పిడికి సిద్ధం కాలేదు. కృత్రిమ అవయవాల్లోని జీవ అణువుల ద్వారా మూత్రపిండాలను మరమ్మతు చేసే అవకాశం ఉందని డాక్టర్ బెంజమిన్ డెకెల్ చెప్పారు.