Health Department: అయ్యప్ప భక్తులూ.. పారాహుషార్
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:00 AM
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది.
నదీ స్నానం చేసే సమయంలో జాగ్రత్త
ముక్కులోకి నీళ్లు పోకుండా చూసుకోండి బ్రెయిన్ ఫీవర్ కేసులతో కేరళ అప్రమత్తం
ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసిన ఆరోగ్య శాఖ
పథనంతిట్ట(కేరళ), నవంబరు 15: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదీ స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే చికిత్స పొందుతున్నవారు తమ ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులు, మందులు వెంట తీసుకెళ్లాలని, యాత్రకు వచ్చేవారు రోజువారీగా వాడే మందులు నిలిపివేయకూడదని కోరింది. నిదానంగా నడవాలని, దారిలో అక్కడక్కడా విశ్రాంతి తీసుకోవాలని, అలసట, ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం, నీరసం వంటి సమస్యలు ఎదురైనప్పుడు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో తక్షణ వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో 04735 203232 నంబరులో సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17 నుంచి శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ... వేడి చేసిన నీటినే తాగాలి. ఆహారం తీసుకొనే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాత తినాలి. మూత పెట్టని, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవద్దు. బహిరంగ మలవిసర్జన నిషేధం. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించాలి.
వ్యర్థాలను చెత్త డబ్బాల్లో మాత్రమే పడేయాలి. యాత్రకు రావడానికి కొద్ది రోజుల ముందునుంచి భక్తులు నడక వంటి తేలికపాటి వ్యాయమాలు చేయాలి. పంపా నుంచి సన్నిధానం వరకూ అత్యవసర వైద్య కేంద్రాలతో పాటు భక్తుల కోసం ప్రత్యేక అంబులెన్స్ సేవలు. పంపాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ సెంటర్ ఏర్పాటు. పథనంతిట్ట జనరల్ ఆస్పత్రిలో అత్యవసర కార్డియాలజీ సేవలు, క్యాథ్ ల్యాబ్ ప్రారంభం. యాత్రికులకు అవగాహన కల్పించేందుకు మలయాళంతో పాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో బ్యానర్లు, బోర్డులు సిద్ధం.