Kejriwal: తప్పుడు కేసులు పెట్టిన మంత్రికి ఎన్నేళ్లు జైలు శిక్ష విధించాలి?
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:17 AM
అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని, పదవులు కట్టబెట్టే నేతలు కూడా వారి పదవులకు రాజీనామా చేయాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు.
అమిత్ షాకు కేజ్రీవాల్ కౌంటర్
న్యూఢిల్లీ, ఆగస్టు 25: అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని, పదవులు కట్టబెట్టే నేతలు కూడా వారి పదవులకు రాజీనామా చేయాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయం సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుకు సోమవారం ఆయన ఈ మేరకు ఘాటుగా స్పందించారు. 30 రోజులు అంతకంటే ఎక్కువ కాలం జైల్లో ఉన్న వారు పీఎం, సీఎం, మంత్రుల పోస్టుల్లో కొనసాగకుండా నిషేధం విధించాలన్న బిల్లులపై అమిత్ షా స్పందిస్తూ.. అవినీతి, క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులుగా జైలు నుంచి పాలన కొనసాగిస్తారా? అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ‘‘తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని పార్టీలో చేర్చుకొని, వారిపై కేసులన్నీ ఎత్తివేయించి, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులు/ ముఖ్యమంత్రులుగా చేస్తున్నారు.
అలాంటి మంత్రి లేదా ప్రధాన మంత్రి కూడా తమ పదవులకు రాజీనామా చేయాలి కదా? ఎవరినైనా తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపించిన తర్వాత వారు అమాయకులని తేలితే ఎలా? తప్పుడు కేసు పెట్టిన మంత్రికి ఎన్నేళ్లు శిక్ష విధించాలి?’’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘‘రాజకీయ కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపింది. అక్కడి నుంచే నేను 160 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపా’’ అని చెప్పారు. అలాంటి సమయంలో కూడా తాను ఢిల్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూశానన్నారు.