Karnataka Introduces Bill Against Hate Speech: నోరు జాగ్రత్త!
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:38 AM
కర్ణాటకలో ఇకపై నలుగురిలో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాల్సిందే. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే జైలుకు వెళ్లాల్సి రావచ్చు.....
కర్ణాటక శాసన సభలో ద్వేషపూరిత వ్యాఖ్యల వ్యతిరేక బిల్లు
కులం, ధార్మిక అంశాలపై ఇతరులకు బాధ కలిగించేలా మాట్లాడితే జైలే
బెంగళూరు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఇకపై నలుగురిలో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాల్సిందే. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే జైలుకు వెళ్లాల్సి రావచ్చు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శాసనసభ శీతాకాల సమావేశాలల్లో ద్వేషపూరిత వ్యాఖ్యల వ్యతిరేక బిల్లును బుధవారం ప్రవేశపెట్టింది. కులం, సమాజం, లింగ, లైంగిక, జన్మస్థలం, ధార్మిక అంశాలను ప్రస్తావిస్తూ.. ఇతరులకు బాధ కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే జరిమానా, జైలు శిక్ష విధించాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లును ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లును హోం శాఖ మంత్రి పరమేశ్వర సభలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో స్పీకర్ యూటీ ఖాదర్ మూజువాణి ఓటింగ్‌కు అనుమతించగా, ప్రతిపక్ష బీజేపీ సభ్యులు వ్యతిరేకిస్తూ డివిజన్‌కు పట్టుబట్టారు. అయితే స్పీకర్ బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి లేదా సమూహం లేదా మరణించిన వారిపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు, సంజ్ఞలు, రాతలు, దృశ్య, ఎలకా్ట్రనిక్ సమాచార వ్యవస్థల ద్వారా చేసే దుష్ప్రచారం చేసే ప్రతి చర్యను ద్వేషపూరిత వ్యాఖ్యలుగా పరిగణిస్తారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారికి తొలిసారి ఏడాది నుంచి ఏడేళ్లపాటు జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తారు. పునరావృతమైతే రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తారు. ఈ నేరాలను నాన్‌బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులోనే శిక్షలు విఽధించేలా బిల్లును రూపొందించి, శాసనసభలో ప్రవేశపెట్టారు. పరిషత్ ముందుకు ఈ బిల్లు గురువారం వచ్చే అవకాశం ఉంది. కాగా.. బిల్లు సభలో ప్రవేశపెట్టడంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అజెండాలో ద్వేషపూరిత వ్యాఖ్యల వ్యతిరేక బిల్లు భాగమని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్వేష పూరిత వ్యాఖ్యలను అంగీకరించబోమని స్పష్టంచేశారు.