Kerala CM Pinarayi Vijayan: కర్ణాటకలోనూ యూపీ తరహా బుల్డోజర్ రాజ్
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:58 AM
ఉత్తరప్రదేశ్ తరహాలో కర్ణాటకలోనూ ‘బుల్డోజర్ రాజ్’ (బుల్డోజర్ ప్రభుత్వం) నడుస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు.
కోగిలు లే ఔట్‌లో ఇళ్ల కూల్చివేతపై కేరళ సీఎం ఆగ్రహం
బాధితులకు ఆ రాష్ట్ర ఎంపీ ఏఏ రహీం పరామర్శ
బెంగళూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ తరహాలో కర్ణాటకలోనూ ‘బుల్డోజర్ రాజ్’ (బుల్డోజర్ ప్రభుత్వం) నడుస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. బెంగళూరు ఉత్తర పరిధిలోని కోగిలు లే ఔట్‌లో గ్రేటర్ బెంగళూరు ప్రాధికార(జీబీఏ) అధికారులు ఇటీవల ఇళ్లను కూల్చివేయడంపై ఆయన శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇళ్లను కూల్చివేయడంతో ముస్లింలు రోడ్డున పడ్డారని, ప్రత్యామ్నాయంగా వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోగిలు క్రాస్‌లోని పకీర్ కాలనీ, వసీం లే ఔట్‌లో అక్రమంగా నిర్మించిన షెడ్లను జీబీఏ అధికారులు కూల్చివేశారు. ఇక్కడ 14.36 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 200 మంది తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకుని నివసించేవారు. ఈ భూమిని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగానికి కేటాయించారు. ఆ ప్రాంతంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు తాత్కాలిక ఇళ్లను మూడ్రోజుల క్రితం కూల్చివేశారు. ఈ చర్య కేరళ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య వివాదం రగిల్చింది. కేరళ రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం నేతృత్వంలోని ఓ బృందం శనివారం పకీర్ లే ఔట్‌కు వచ్చి ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించింది. ఈ విషయమై ఢిల్లీలో సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ, అనధికారికంగా నిర్మించుకున్న తాత్కాలిక షెడ్లను తొలగించామని తెలిపారు. ఇల్లు కోల్పోయినవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రేటర్ బెంగళూరు కమిషనర్, సెక్రటరీని ఆదేశించామని వెల్లడించారు. కాగా.. కేరళ సీఎం వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో స్పందించారు. అక్రమంగా నివసించేవారి ఇళ్లను మాత్రమే తొలగించామని, ఇందులో ముస్లింలనే ప్రశ్న రాదని అన్నారు. ఇళ్లను కోల్పోయినవారికి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.