Share News

Political Unity: కర్ణాటకానికి తెర

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:07 AM

కర్ణాటక రాజకీయాల్లో కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఇద్దరూ ఒకచోట సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

Political Unity: కర్ణాటకానికి తెర

  • సిద్దరామయ్య, శివకుమార్‌ అల్పాహార భేటీ

  • మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాల్లేవు

  • 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యం: సిద్దూ

  • అధిష్ఠానం ఆదేశాలు పాటిస్తాం: శివకుమార్‌

బెంగళూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాజకీయాల్లో కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఇద్దరూ ఒకచోట సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తామిద్దరం కలిసే ఉన్నామనే సందేశం ఇచ్చేలా శనివారం ఉదయం సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన డీకే అక్కడే అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు సుమారు అరగంటకుపైగా మాట్లాడుకున్నారు. అనంతరం సీఎం, డీసీఎం కలిసి మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇకముందు కూడా ఉండబోవని సిద్దరామయ్య స్పష్టం చేశారు. నాయకత్వ మార్పునకు సంబంధించి ఇకపై ఏ విభేదాలు ఉండవని చెప్పారు. తాము ఐక్యంగానే ఉన్నామని, 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. అధిష్ఠానం తీర్మానానికి అనుగుణంగా నడుచుకుంటామని, అల్పాహార విందులోనూ అదే తీర్మానించామని వివరించారు. నాయకత్వం మార్పుపై కొన్ని మీడియాల ద్వారానే ఎక్కువ చర్చ జరిగిందన్నారు. మరో వారం రోజుల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ-జేడీఎస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దీటుగా ఎదుర్కొంటామని సీఎం పేర్కొన్నారు. డీసీఎం డీకే శివకుమార్‌ మాట్లాడుతూ, ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనిచేస్తున్నామని అన్నారు. సిద్దరామయ్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిందని, రాజకీయంగా ఇద్దరిదీ ఒకే తీర్మానమని చెప్పారు.


హైకమాండ్‌ చెప్పినట్లుగానే కలసి ముందుకెళ్తామని తెలిపారు. తాను గ్రూపులకు అవకాశం ఇవ్వనని, నాయకత్వం విషయంలోనూ అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తానని స్పష్టం చేశారు. 2028లోనూ గత ఫలితాలే పునరావృతం అవుతాయని డీకే ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగి శివకుమార్‌ను సిద్దరామయ్య దగ్గరకు వెళ్లి కలవాలని, తద్వారా ఇద్దరూ కలిసే ఉన్నారన్న సంకేతం ఇవ్వాలని, ఊహాగానాలకు తెరదించాలని ఆదేశించింది. మరోవైపు, శనివారం డీకేను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించాలని సిద్దరామయ్యకు సూచించింది. దీనికి ఇద్దరూ అంగీకరించారు.


సీఎం పదవి పోయినప్పుడు ఏ మఠాధిపతీ మాట్లాడలేదు

కేంద్ర మంత్రి కుమారస్వామి ఆక్రోశం

నాయకత్వ మార్పు అంశంపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన పలువురు స్వామీజీలు డీకే శివకుమార్‌కు అండగా నిలిచారు. వారి తీరుపై కేంద్రమంత్రి కుమారస్వామి శనివారం మండిపడ్డారు. రాజకీయాల కారణంగా తాను రెండుసార్లు సీఎం పదవిని కోల్పోయానని, అప్పట్లో తనకు ఏ మఠాధిపతీ మద్దతుగా మాట్లాడలేదని ఆరోపించారు. కులాల పేరు చెప్పుకొని ధార్మిక, ఆధ్యాత్మిక రంగాలను దుర్వినియోగం చేయడం, రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదన్నారు. ఒక్కలిగ, కురుబ, ఇతర సామాజికవర్గాలకు చెందిన స్వామీజీలు రాజకీయ చర్చల్లో పాల్గొనడం, ఒకరికి మద్దతు ఇవ్వడం సరికాదని తెలిపారు. మఠాధిపతులు రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు.

Updated Date - Nov 30 , 2025 | 06:34 AM