Woman Bites Off Man: ప్రియుడి నాలుకను కొరికేసిన మాజీ ప్రియురాలు.. కారణం అదే...
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:40 PM
తనను లైంగికంగా వేధించబోయిన ఓ వ్యక్తిని ప్రతిఘటించిందో మహిళ. అప్పటికీ అతడు వినిపించుకోకపోవడంతో ఎదురుదాడికి దిగింది. ఆత్మరక్షణలో భాగంగా.. అతడి నాలుకను కొరికిందామె. దీంతో అతడి నాలుక తెగిపడింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి గుణపాఠం చెప్పిందో మహిళ. తనను లైంగికంగా వేధించి, బలవంతంగా ముద్దాడాడనే ఆగ్రహంతో ప్రతిఘటిస్తూనే అతడి నాలుకను కొరికేసింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. గమనించిన స్థానికులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
అసలేమైందంటే..
కాన్పూర్‌లోని దరియాపుర్ గ్రామానికి చెందిన చాంపి అనే 35 ఏళ్ల వ్యక్తికి గతంలోనే పెళ్లయింది. అతడు మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నాడు. ఇంతలో ఆమెకు పెళ్లి నిశ్చయం కావడంతో.. అతడికి దూరంగా ఉంటోంది. అయినప్పటికీ చాంపి.. ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఆమె ఒంటరిగా పొయ్యి మట్టిని సేకరించేందుకు చెరువు వద్దకు వెళ్లింది. గమనించిన అతను ఆమెను అనుసరించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అతణ్ని ప్రతిఘటించి వెంటనే నెట్టేసింది. అయినప్పటికీ బలవంతంగా ముద్దాడాడు. ఆత్మరక్షణలో భాగంగా ఆమె చాంపి నాలుకను గట్టిగా కొరికింది. ఈ ఘటనలో అతడి నాలుక తెగిపడింది.
తీవ్ర రక్తస్రావంతో పాటు నొప్పిని తట్టుకోలేక చాంపి కేకలు వేశాడు. ఇంతలో స్థానికులంతా అక్కడ గుమిగూడారు. అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అతణ్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్‌లోని హాలెట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను అక్కడి డిప్యూటీ కమిషనర్ దినేశ్ త్రిపాఠి ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
ఇవీ చదవండి:
చిన్నారుల మిస్సింగ్‌పై సుప్రీంకోర్టు ఆందోళన
ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. పేలుడుకు ముందు వీడియో రికార్డ్ చేసిన ఉమర్