Share News

Justice Surya Kant Sworn: సూర్యకాంత్‌ అనే నేను..

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:04 AM

భారత 53వ ప్రధాన న్యాయమూర్తి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం ప్రమాణం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ గణతంత్ర మండపంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో..

Justice Surya Kant Sworn: సూర్యకాంత్‌ అనే నేను..

  • 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

  • ఉప రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్‌, సీఎం రేవంత్‌ తదితరుల హాజరు

  • 15 నెలలపాటు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్‌ సూర్యకాంత్‌

  • బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 17 కేసుల విచారణ

  • అత్యవసర కేసులను ఇకపై లిఖితపూర్వకంగానే సమర్పించాలి

  • పెండింగ్‌ కేసులు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి: జస్టిస్‌ సూర్యకాంత్‌

  • రాష్ట్రపతి భవన్‌లోనే అధికారిక వాహనాన్ని వదిలి వెళ్లిన మాజీ సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయి

న్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): భారత 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం ప్రమాణం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ గణతంత్ర మండపంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో.. ‘దైవసాక్షిగా..’ అంటూ నూతన సీజేఐ ప్రమాణం చేశారు. అనంతరం తన అక్క, అన్న పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మాజీ జస్టిస్‌ బీఆర్‌ గవాయిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ వేడుకలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని మోదీ, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌తోపాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, రామ్మోహన్‌ నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి.. ఏడు దేశాల (భూటాన్‌, కెన్యా, మలేసియా, మారిషస్‌, నేపాల్‌, శ్రీలంక, బ్రెజిల్‌) ప్రధాన న్యాయమూర్తులు తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిశాక.. జస్టిస్‌ బీఆర్‌ గవాయి తన అధికారిక వాహనాన్ని రాష్ట్రపతి భవనంలోనే వదిలేసి వెళ్లారు. కాగా, జస్టిస్‌ సూర్యకాంత్‌ 2027 ఫిబ్రవరి 9 వరకూ.. అంటే సుమారు 15 నెలలపాటు సీజేఐగా కొనసాగనున్నారు.


నూతన నియమం..

సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ తొలిరోజే విధానపరమైన ఒక నూతన నియమానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర జాబితా కోసం కేసుల ప్రస్తావన విషయంలో మౌఖిక అభ్యర్థనలకు స్వస్తి పలికారు. ఆయా కేసులను రాతపూర్వకంగానే మెన్షన్‌ చేయాలని స్పష్టం చేశారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి వాటి విషయంలో మౌఖిక అభ్యర్థనలను స్వీకరిస్తామని తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రపతి భవన్‌ నుంచి సీజేఐ హోదాలో సుప్రీంకోర్టుకు చేరుకున్న ఆయన.. కోర్టు ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్‌-ఆన్‌-రికార్డ్‌ అసోసియేషన్‌ (ఎస్‌ సీఏఓఆర్‌ఏ) అధ్యక్షులు విపిన్‌ నాయర్‌ నూతన సీజేఐకి కోర్టు హాలులోకి స్వాగతం పలికారు. ఆ తర్వాత హెరిటేజ్‌ కోర్టు నంబర్‌ వన్‌లో.. జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చీ, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌ చందూల్కర్‌తో కూడిన ధర్మాసనానికి అధ్యక్షత వహించారు. మొదటిరోజు 17 కేసులను విచారించారు. మధ్యాహ్నం తర్వాత.. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక ప్రైవేట్‌ సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సీజేఐ తీర్పును వెలువరించారు. కాగా.. ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన జస్టిస్‌ సూర్యకాంత్‌.. పెండింగ్‌ కేసులను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ‘‘సుప్రీంకోర్టులో 90 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, దీనికి కారణాలు ఎంతో సంక్లిష్టంగా ఉన్నాయి. గత ఆరు నెలల్లో నమోదైన కేసుల సంఖ్యలో స్పష్టమైన పెరుగుదల కనిపించింది. కేసుల సంఖ్య నెలకు దాదాపు నాలుగైదు వేల నుంచి ఏడు వేలకు పెరిగింది. హైకోర్టులను దాటవేసి నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దిగువ కోర్టులతోపాటు సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించిన, చాలా కాలంగా నిలిచిపోయిన కేసులను పరిష్కరించడంపై శ్రద్ధ పెడతాం. పెండింగ్‌ కేసులను గుర్తించి వాటి పరిష్కారానికి బెంచ్‌లు ఏర్పాటు చేస్తా’’ అని పేర్కొన్నారు.


జిల్లా కోర్టు వకీల్‌ నుంచి సీజేఐ స్థాయికి

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణావాసిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ రికార్డు సృష్టించారు. ఆయన..1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1981లో హిసార్‌ ప్రభుత్వ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం హిసార్‌ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తి మొదలు పెట్టారు. 1985లో పంజాబ్‌ హరియాణా హైకోర్టులో ప్రాక్టీసు చేయడం కోసం చండీగఢ్‌కు వెళ్లారు. 2000 జూలై 7న.. అత్యంత పిన్న వయస్సులో హరియాణా అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులు అయ్యారు. 2004 జనవరి 9న పంజాబ్‌ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018 అక్టోబరు 5న హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2024 నవంబరు 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో.. ఆ రాష్ట్ర మాజీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన ధర్మాసనానికి జస్టిస్‌ సూర్యకాంత్‌ నాయకత్వం వహించారు. సీబీఐకి.. తనపై ఉన్న ‘పంజరంలో చిలుక’ అనేభావనను తొలగించేలా పని చేయాలని సూచించారు.

1.jpg

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌ హాజరు

న్యాయ నిపుణుడిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ అనుభవం దేశ న్యాయ వ్యవస్థకు మార్గదర్శకంగా నిలవాలని, దేశ న్యాయ వ్యవస్థలో సరికొత్త కాంతులు నిండాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. ‘‘భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నత పదవిని స్వీకరించిన జస్టిస్‌ సూర్యకాంత్‌కు అభినందనలు. మీ నాయకత్వంలో దేశంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా కిందిస్థాయి వర్గాలకు న్యాయం దక్కుతుందని కోరుకుంటున్నాను.’’ అని రేవంత్‌ రెడ్డి ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మరోవైపు.. ప్రధాని మోదీ కూడా ఎక్స్‌ వేదికగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌కు శుభాభినందనలు తెలియజేశారు. ఇక.. జస్టిస్‌ సూర్యకాంత్‌ నాయకత్వంలో రాజ్యాంగ విలువలపైన, చట్టపాలనపైన ప్రజల విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్లు ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు.


కీలక తీర్పులు..

  • జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370 నిర్వీర్యం నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ ఒకరు.

  • సెక్షన్‌ 124 ఏ (దేశద్రోహం) పై స్టే విధించారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించే వరకూ దాన్ని అమలు చేయొద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించిన ధర్మాసనంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.

  • పెగాసస్‌ కేసులో విచారణ కోసం సైబర్‌ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్న ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉన్నారు. జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు.

  • బిహార్‌ ఓటర్ల జాబితా వివాదంలో కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించిన ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ ఒకరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను బహిరంగపరచాలని ఈసీని ఆదేశించారు.

Updated Date - Nov 25 , 2025 | 04:06 AM