Justice Surya Kant: సుప్రీం తదుపరి సీజేగా జస్టిస్ సూర్యకాంత్!
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:43 AM
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ లేఖ రాశారు
ఆయన పేరును కేంద్రానికి సూచించిన చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ లేఖ రాశారు. సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టులోని సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జిని తన వారసుడిగా ప్రస్తుత చీఫ్ జస్టిస్ ప్రతిపాదించాలి. సీజే గవాయ్ తర్వాత జస్టిస్ సూర్యకాంతే సీనియర్. ఈ నేపథ్యంలో ఆయన పేరును జస్టిస్ గవాయ్ సిఫారసు చేశారు. ఈ సిఫారసును కేంద్ర న్యాయశాఖ ఆమోదించి తత్సంబంధ ప్రక్రియను ప్రారంభిస్తే, 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నవంబరు 24న బాధ్యతలు చేపడతారు. దానికి ఒకరోజు ముందు, జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగిస్తుంది. జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ప్రధాన న్యాయమూర్తిగా ఆ పదవిలో ఆయన 15 నెలలు కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీతో ఆయన పదవీకాలం ముగిస్తుంది.