Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:38 AM
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది...
నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము
కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ.. 24న ప్రమాణం
2027 ఫిబ్రవరి 9 దాకా పదవిలో జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ, అక్టోబరు 30: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబరు 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్ పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో నవంబరు 24న జస్టిస్ సూర్యకాంత్ 53వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన దాదాపు 15 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2027, ఫిబ్రవరి 9న జస్టిస్ సూర్యకాంత్ పదవీ విరమణ చేస్తారు. ‘‘భారత రాజ్యాంగం కల్పించిన అధికారం మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిస్ సూర్యకాంత్‌ను నవంబరు 24 నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు’’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి హరియాణా వాసి కావడం గమనార్హం.