Share News

Justice Gavai: ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వక్కర్లేదు

ABN , Publish Date - Nov 24 , 2025 | 03:58 AM

ఎవరైనా న్యాయమూర్తి తాను స్వతంత్రుడనని నిరూపించుకునేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పేర్కొన్నారు....

Justice Gavai: ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వక్కర్లేదు

  • అలా ఇస్తేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జి అనుకుంటారనే భావన సరికాదు

  • కోర్టు ముందున్న పత్రాలు, ఆధారాల మేరకే తీర్పులు ఇవ్వాలి

  • న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం కొలీజియం వ్యవస్థ ఉండాల్సిందే

  • ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ ఉండాలి: జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

న్యూఢిల్లీ, నవంబరు 23: ఎవరైనా న్యాయమూర్తి తాను స్వతంత్రుడనని నిరూపించుకునేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించక తప్పదని, కోర్టు ముందున్న ఆధారాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం అవసరమని చెప్పారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఆదివారం పదవీ విరమణ చేసిన జస్టిస్‌ గవాయ్‌ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక న్యాయమూర్తిగా తమ ఎదుట ఉన్నది ప్రభుత్వమా, ప్రైవేటు వ్యక్తులా అన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోకూడదు. కోర్టు ముందున్న పత్రాలు, ఆధారాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జి అనే భావన కొందరిలో ఉంది. అది సరికాదు. స్వతంత్రంగా వ్యవహరించే న్యాయమూర్తి అని నిరూపించుకునేందుకు ప్రభుత్వం చేసే ప్రతిదానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని గవాయ్‌ చెప్పారు.

కొలీజియం వ్యవస్థ తప్పనిసరి!

ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం కొనసాగాలంటే.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాల్సిదేనని జస్టిస్‌ గవాయ్‌ చెప్పారు. జడ్జీల నియామకాలకు సంబంధించిన కొలీజియం వ్యవస్థపై కొన్ని విమర్శలు ఉన్నా.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను నిలుపుకొనేందుకు అది తప్పనిసరని పేర్కొన్నారు. అదే సమయంలో నిఘా, దర్యాప్తు సంస్థలు, కేంద్ర న్యాయశాఖ నుంచి వచ్చే నివేదికలు, సూచనలను కొలీజియం కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. కొందరు మహిళా న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించే ప్రతిపాదనను పరిశీలించామని.. కానీ కొలీజియంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో నియమించలేకపోయామని జస్టిస్‌ గవాయ్‌ పేర్కొన్నారు.


గవర్నర్లకు గడువు విధించలేం.

గవర్నర్లకు గడువు విధించలేమన్న తాజా తీర్పుపై విమర్శలను ప్రస్తావించగా.. ‘‘రాజ్యాంగంలో లేని దానిని మేం చెప్పలేం. రాజ్యాంగం వ్యవస్థల మధ్య అధికారాలను విభజించింది. అందువల్ల గవర్నర్లకు గడువును నిర్దేశించలేమని చెప్పాం. అదే సమయంలో అవసరమైన మేర న్యాయ సమీక్షకు అంగీకరించాం. గవర్నర్లు సుదీర్ఘకాలం బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సరికాదని, అలాంటి సమయంలో న్యాయ సమీక్ష ఉంటుందని స్పష్టం చేశాం’’ అని చెప్పారు. ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్‌ కంటే సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎప్పుడూ పైస్థాయిలో ఉంటారని పేర్కొన్నారు. ఇక పాలన వ్యవస్థ నుంచి తాను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోలేదని తెలిపారు.

రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ ఉండాలి..

తన తండ్రి పెంపకం, రాజ్యాంగ సూత్రాలు, సామాజిక, ఆర్థిక న్యాయం తదితర అంశాలు తనను ప్రభావితం చేశాయని.. రాజ్యాంగ సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు మధ్య సమతౌల్యం ఉండాలనేది తన నమ్మకమని గవాయ్‌ చెప్పారు. రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ ఉండాలన్నది తన అభిమతమని, దానిపై చట్టం చేసే బాధ్యత ప్రభుత్వానిదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఒక పెద్ద అధికారి కుమారుడు, మరో వ్యవసాయ కూలీ కుమారుడు ఇద్దరినీ ఒకేలా చూడటం సరికాదన్నారు. రిజర్వేషన్లతో కొన్ని ఎస్సీ కుటుంబాలు తరతరాలుగా ప్రయోజనం పొందుతూనే ఉన్నాయని చెప్పారు.

Updated Date - Nov 24 , 2025 | 06:26 AM