Share News

SLBC Contractor Arrested: హౌసింగ్‌ స్కాంలో ఎస్‌ఎల్‌బీసీ కాంట్రాక్టర్‌ అరెస్టు

ABN , Publish Date - Nov 14 , 2025 | 03:58 AM

హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో వేల కోట్ల మనీలాండరింగ్‌ కుంభకోణానికి సంబంధించి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌....

SLBC Contractor Arrested: హౌసింగ్‌ స్కాంలో ఎస్‌ఎల్‌బీసీ కాంట్రాక్టర్‌ అరెస్టు

  • జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ మనోజ్‌గౌర్‌పై ఈడీ చర్య

  • ఢిల్లీ, హరియాణాలో జేపీ ఇన్‌ఫ్రా పలు హౌసింగ్‌ ప్రాజెక్టులు

  • రూ.14,599 కోట్ల మనీలాండరింగ్‌ !

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో వేల కోట్ల మనీలాండరింగ్‌ కుంభకోణానికి సంబంధించి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ మనోజ్‌గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. తెలంగాణలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కాంట్రాక్టు పనులను ఇదే మనోజ్‌గౌర్‌కు చెందిన జేపీ గ్రూపు కంపెనీ చేపట్టింది. ఇటీవల ఆ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. గౌర్‌ నేతృత్వంలోని జేపీ ఇన్‌ఫ్రా సంస్థ ఢిల్లీ, హర్యానాలో జేపీ విష్‌టౌన్‌, జేపీ గ్రీన్స్‌ పేరిట పలు హౌసింగ్‌ ప్రాజెక్టులు ప్రారంభించి వేలాది మంది కొనుగోలుదారుల నుంచి వందల కోట్లను వసూలు చేసింది. ఆ నిధులను గృహ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఉపయోగించకుండా, వాటిని వివిధ ట్రస్టులు, అనుబంధ సంస్థలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. హౌసింగ్‌ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడం, ఫ్లాట్లను అప్పగించకపోవడంతో మోసపోయిన వేలాది మంది పెట్టుబడిదారులు ఢిల్లీ, యూపీలలోని ఆర్థిక నేరాల విభాగం వద్ద అనేక కేసులు నమోదు చేశారు. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ జేపీ గ్రూపునకు చెందిన రెండు సంస్థలు జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ లిమిటెడ్‌ (జేఏఎల్‌), జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ (జేఐఎల్‌) గృహ కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన రూ. 14,599 కోట్ల భారీ మొత్తాన్ని జేపీ సేవా సంస్థాన్‌ (జేఎ్‌సఎస్‌), జేపీ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (జేహెచ్‌ఎల్‌), జేపీ స్పోర్ట్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (జేఎ్‌సఐఎల్‌) వంటి అనుబంధ సంస్థలకు మళ్లించినట్లు గుర్తించింది. మే 23న ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ భారీ మొత్తంలో ఆర్థిక పత్రాలు, డిజిటల్‌ రికార్డులను స్వాధీనం చేసుకుంది. నిధుల మళ్లింపులో గౌర్‌ కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించింది.

Updated Date - Nov 14 , 2025 | 04:25 AM